పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. గత కొంతకాలంగా ఈ ఆలయ స్థలానికి సంబంధించి కొనసాగుతున్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో, భక్తుల కోరిక మేరకు ఆలయ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
పెదపేటలో ఉన్న ఈ పురాతన ఆలయ స్థలం వివాదంలో ఉండటంతో ఇన్నాళ్లూ నిర్మాణం ముందుకు సాగలేదు. అయితే, స్థానిక నాయకులు , న్యాయ నిపుణుల సమన్వయంతో రఘురామ కృష్ణంరాజు చొరవ తీసుకుని ఈ అడ్డంకులను అధిగమించడంలో కీలక పాత్ర పోషించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను పరిష్కరించి, ఆలయ భూమికి పూర్తిస్థాయిలో అనుమతులు లభించేలా చేశారు. పెదపేట రామాలయ పునర్నిర్మాణం వివాదాస్పదం కావడంతో డీఎస్పీ రఘువీర్ విష్ణు నేతృత్వంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 544 మంది పోలీస్ సిబ్బంది ఆకివీడు పట్టణ సరిహద్దుల్లో వివాదస్పద వ్యక్తులను లోపలికి రానివ్వకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చెక్ పోస్ట్ ఏర్పాటుచేశారు. పోలీస్ భద్రత నడుమ శంకుస్థాపన కార్యక్రమం సజావుగా సాగింది.
రామాలయ పునర్ నిర్మాణంలో భాగంగా విజయనగరం పండితులచే ముహూర్తం ఖరారు అయిందని రఘురామ తెలిపారు. ఎంతో మంది కోర్టుల ద్వారా ఆటంకాలు కలిగించాలని చూసినా విజయవంతంగా శంకుస్థాపన పూర్తయిందని పేర్కొన్నారు. కోర్టులలో ఇంకెన్ని జడలు విప్పిన ఇంక ఏమి చేయలేరని విమర్శించారు. రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా కొంతమంది కేసులు వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మా సహనానికి కూడా హద్దు ఉంటుందని దాన్ని బలవంతంగా దాటేటట్టు చేయొద్దని హెచ్చరించారు.ఈ కార్యక్రమం ఎంతో మంది అదృష్ట శక్తులు పనిచేయడం వల్ల ఇంతటి విజయం లభించిందన్నారు.

