Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్కే పలుకు:   అప్పు మీద ఇంత బాధపడిపోయారేంటి ?

ఆర్కే పలుకు: అప్పు మీద ఇంత బాధపడిపోయారేంటి ?

Telugu 360 1 week ago

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకు అంతా అప్పుల బాధల గురించే. ఆయనకు ఏమైనా అప్పులు ఉన్నాయో లేవో కానీ ప్రభుత్వాల నుంచి కిందిస్థాయి వ్యక్తుల వరకూ అందరూ అప్పులు చేసి పప్పు కూడు తింటున్నారని బాధపడిపోయారు.

వినిమయతత్వం పెరిగిపోయిందట. నెలకు రెండు లక్షల కోట్లకుపైగా కేంద్రానికి జీఎస్టీ వస్తోందంటే దాని అర్థం అందరూ అప్పులు చేసి ఇష్టం వచ్చినట్లుగా అడ్డగోలు వస్తువులన్నీ కొనేసి అప్పుల పాలవుతున్నారట. ఆర్కేకు ఏం చూసిన తర్వాత ఇంత ఆవేదన కలిగిందో కానీ ఈ విషయంలో ఆయన సరైన రీసెర్చ్ చేయలేకపోయారని అనుకోవచ్చు.

అందరూ అప్పులు చేస్తున్నారని ఆయన చెప్పలేరు. క్రెడిట్ కార్డు వాడటం అప్పు చేయడం కాదు. రోజువారీ ఖర్చులను కూడా క్రెడిట్ కార్డుతో చెల్లించి ఒకే సారి బిల్లు చెల్లిస్తారు. అదే సమయంలో అప్పులు ఎలా ఇస్తారో ఆర్కే కాస్త రీసెర్చ్ చేసి ఉండాల్సింది. లోన్ యాప్ ల గురించి పత్రికల్లో వచ్చినవి చదివి అవి అలా విచ్చలవిడిగా అప్పులు ఇస్తున్నాయని అనుకుంటారు. ఆ యాప్‌ల టార్గెట్ .. ఆదాయం లేని విద్యార్థులు..ఇతర వర్గాలు. అలాంటి యాప్‌లలో తీసుకున్న వాళ్లు చెల్లించడం తక్కువ. కానీ ఆర్గనైజ్డ్ సెక్టార్లలో అప్పులు ఇవ్వడానికి అనేకం చూస్తాయి. చెల్లించే సామర్థ్యం ఉంటేనే ఇస్తారు. అలా తీసుకునేవారంతా అనుత్పాదక వ్యయం చేస్తారన్న గ్యారంటీ లేదు. బంగారం కొనడానికి కూడా అప్పులు చేస్తున్నారని.. ఆర్కే బాధపడిపోయారు. నిజం చెప్పాలంటే బంగారం కొనడానికి అప్పు చేస్తే.. మంచిదే. ఏడాది తర్వాత ఆ బంగారం బ్యాంకులో పెట్టుకున్నా చేసిన అప్పు అంతా తీరిపోతుంది. ఆ లాజిక్ ఆర్కేకు అర్థం కాలేదని ఆయన ఆర్టికల్ ను బట్టి తెలిసిపోతుంది. అది అనుత్పాదక వ్యయం కాదు.

ఆర్కే చేసిన విచిత్రం ఏమిటంటే.. ప్రస్తుతం మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు..ఈ అప్పులకు లింక్ పెట్టడం. ఈ అప్పులు చేసి చేసే కొనుగోళ్ల వల్లనే సంక్షోభం వస్తుందన్నట్లుగా లింక్ పెట్టారు. ఆ లాజిక్ అర్థం చేసుకోవడం కష్టమే. అదే సమయంలో రాజకీయ నేతలు చేస్తున్న దుబారాను ప్రశ్నించారు. కానీ చంద్రబాబు కేబినెట్ లో చర్చించి .. పొదుపు చర్యలు తీసుకుంటే మాత్రం అతి అన్నారు. ఇలా చెప్పుకుంటే.. ఆర్కే ఈ వారం కొత్త పలుకు మొత్తం .. చాలా సాదాసీదాగా.. అప్పుల భయమో.. ప్రజలంతా అప్పులు చేసి అవసరం లేనివి కొనేస్తున్నారన్న ఆందోళనతోనే రాశారు. ఇందుకు ఆయనకు ఎదురైన అనుభవాలే కారణం కావొచ్చు. కానీ ప్రపంచం వేరు.

ఇక్కడ కొసమెరుపేమిటంటే ప్రజలకు ప్రభుత్వాలు ఏవో ఉచితంగా ఇస్తున్నాయని ప్రజలంతా పని చేయడం మానేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ పథకాలు అంత సమర్థంగా అమలవుతున్నాయని ఆర్కే అనుకుంటున్నారేమో … ఒక్క రేషన్ బియ్యం తప్ప మరే పథకమూ సంతృప్త స్థాయిలో లబ్దిదారులకు అందదు. ప్రభుత్వాన్ని నమ్మి పనులు మానేసేవాళ్లు ఎవరూ ఉండరు. ఎవరైనా ఉంటే అది వారికి స్వతహాగా ఉండే మనస్థత్వం. పని చేయడానికి ఎవరూ దొరకడం లేదని ఆర్కే అంటున్నారు..కానీ ఆయన ..తన ఆఫీసులో ఆఫీస్ బాయ్ కావాలి అని ఓ ప్రకటన ఇస్తే… వంద మంది వస్తారనేది నిష్ఠూరసత్యం. చివరికి మోడీ సంక్షోభాన్ని శక్తిమాన్‌లా ఎదుర్కొంటారని కవర్ చేశారు. ఆర్టికల్‌గా వెయిట్ రావడానికన్నట్లుగా మోడీ పేరు రాశారు కానీ… అసలు రాసిన మొత్తానికి మోడీ శక్తికి సంబంధం ఉండదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360