కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బిగ్ కంపెనీగా ఉన్న రాఘవ గ్రూప్ ఇప్పుడు డిఫెన్స్ రంగంలోకి అడుగు పెట్టింది. రాఘవ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ నూతన హైటెక్ వెంచర్‌ను డీఆర్డీవో మాజీ ఛైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
రక్షణ రంగంలో భారత్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి తమ సంస్థ చేయూతనిస్తుందని పొంగులేటి అంటున్నారు.
ఇప్పటికే తయారీ ప్లాంట్ రెడీ
ఈ నూతన సంస్థ ద్వారా మిసైల్స్ , సైనిక విమానాలు, అంతరిక్ష వ్యోమనౌకలు , రక్షణ రంగ పరికరాల్లో ఉపయోగించే అత్యంత సంక్లిష్టమైన హై-ప్రిసిషన్ విడిభాగాలు , సోలెనోయిడ్ వాల్వ్‌లు , స్పెషలైజ్డ్ మెకానికల్ కాంపోనెంట్లను డిజైన్ చేసి ఉత్పత్తి చేయనున్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక తయారీ ప్లాంట్‌ను ఈ సంస్థ ఇప్పటికే సిద్ధం చేసింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ , డిఆర్‌డిఓ వంటి దేశీయ ప్రభుత్వ రక్షణ దిగ్గజాలకు విడిభాగాలను సరఫరా చేయడంతో పాటు, ప్రపంచ స్థాయి ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థల సప్లై చైన్‌లో భాగస్వామ్యం కావడం ఈ ప్లాంట్ ప్రధాన లక్ష్యం.
ఎగుమతుల టార్గెట్
సంస్థ భవిష్యత్ కార్యాచరణపై రాఘవ్ ఏరోస్పేస్ మేనేజింగ్ డైరెక్టర్ పొంగులేటి లిఖిత్ రెడ్డి నమ్మకంతో ఉన్నారు. కేవలం దేశీయ అవసరాలకే పరిమితం కాకుండా, గ్లోబల్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మార్కెట్‌లోకి ప్రవేశించి అంతర్జాతీయ సంస్థల సరఫరాదారుగా నిలవడమే తమ ప్రాథమిక లక్ష్యమని స్పష్టం చేశారు. పరిశోధన-అభివృద్ధి , కచ్చితత్వంతో కూడిన ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ, భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ, మిసైల్ ప్రొపల్షన్ సిస్టమ్స్ వంటి అధునాతన విభాగాలకు అవసరమైన విడిభాగాలను కూడా ఉత్పత్తి చేసే దిశగా తమ సంస్థ విస్తరించనుందని బిజినెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
వ్యాపారాలను విస్తరిస్తున్న పొంగులేటి కుటుంబం
తెలంగాణలో ఉన్న అనుకూలమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ను ఉపయోగించుకుంటూ రాఘవ్ ఏరోస్పేస్ ఈ రకమైన వ్యూహాత్మక అడుగులు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాఘవ్ గ్రూప్ ఇప్పుడు అధిక లాభదాయకత, సాంకేతిక నైపుణ్యంతో కూడిన రక్షణ రంగ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించడం ద్వారా తమ బిజినెస్ పోర్ట్‌ఫోలియోను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచించింది.

