రాజకీయాల్లోకి రావడం, ప్రధాని స్థాయి నేతపై విమర్శలు గుప్పించడం ఎంత సులువో చూపించడానికి అభిజిత్ దీప్కే ఒక పెద్ద ప్లాన్‌తోనే సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు.
ఎక్కడికి వెళ్లినా మీడియా ప్రతినిధులు గొట్టాలు ముందు పెడుతున్నారంటూ పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ, ఏకంగా దేశ ప్రధానినే ఒక ఇన్‌ఫ్లూయన్సర్ అని సెటైర్లు వేయడం ఆయన మునగచెట్టు ఎక్కేశారని అర్థమయ్యేలా చేస్తుంది.
ఇన్‌ఫ్లూయన్సర్స్ లేకపోతే దీప్కే ఎవరు?
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు, డిజిటల్ ట్రెండ్స్ అనే వ్యవస్థలే లేకపోతే, అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఎవరో ఈ దేశంలో ఎవరికైనా అసలు తెలిసేదా? ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వాడుకుని ప్రచారం పొందుతున్నారో, అవే ప్లాట్‌ఫామ్‌లను వాడుకునే వారిపై వేసే చవకబారు సెటైర్లు ఆయన భావజాలంలోని లోతుపాతులను స్పష్టం చేస్తున్నాయి. ఒక్క సోషల్ మీడియా పోస్ట్ పెట్టి, "కాక్రోచ్ జనతా పార్టీ" అని ఒక క్యాచీ టైటిల్ తగిలించుకుని.. ఆడియన్స్ లైక్‌లు, వ్యూస్‌తో రాత్రికి రాత్రే వైరల్ అయిపోగానే తానేదో దేశాన్ని ఏలే గొప్ప విప్లవ నాయకుడినని దీప్కే భ్రమపడుతున్నారు.
మోదీ కంటే గొప్ప అనుకుంటున్నారా?
'జెన్ జీ' తరానికి తానే పరమావధి అని, యావత్ యువతను వెనక వేసుకుని నడిపిస్తున్నాననే అత్యాశ ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సాంకేతికత అందించిన వేదికపై కొన్ని ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, రీల్స్ క్రియేట్ చేసినంత మాత్రాన నాయకుడు అయిపోలేరనే ప్రాథమిక సూత్రాన్ని ఆయన విస్మరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే నాలుగు మంచి కామెంట్లు, షేర్లను చూసి జాతీయ రాజకీయాన్ని శాసించగలననుకోవడం డిజిటల్ భ్రమ తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా, తనకు బీజేపీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, తమ పార్టీలోకి రమ్మని బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆయన క్రియేట్ చేస్తున్న హైప్ మరీ విడ్డూరంగా ఉంది. రాజకీయంలో లబ్ధి పొందడానికి విపక్షాలు, నాటకీయ పరిణామాలు సృష్టించే నేతలు ఇలాంటి విక్టిమ్ కార్డ్ వాడటం కొత్తేమీ కాదు. కొద్దిపాటి ప్రాచుర్యం రాగానే అధికార పక్షం తనను చూసి భయపడుతోందని, రాజీ పడమని ఒత్తిడి తెస్తోందని కథనాలు అల్లేసుకోవడం కూడా ఈ పబ్లిసిటీ డ్రామాలో ఒక భాగమే. క్షేత్రస్థాయి బలం లేని చోట కేవలం సానుభూతిని, సంచలనాన్ని మూటగట్టుకోవడానికి ఇలాంటి బెదిరింపు డ్రామాలు బాగా ఉపకరిస్తాయని ఆయన భావిస్తున్నట్లున్నారు.
రాజకీయానికి స్పెల్లింగ్ తెలుసా?
నిజమైన రాజకీయం అనేది ఎక్స్ వేదికల మీద, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కామెంట్ల నడుమ సాగే పోరాటం కాదు. గెలుపోటములు, సిద్ధాంతాల ఘర్షణ, క్షేత్రస్థాయి ప్రజా సమస్యల మధ్య సుదీర్ఘకాలం నిలబడటమే అసలైన రాజకీయం. నిజంగా ఆయన రాజకీయమే చేయాలనుకుంటే.. ఓట్లు, క్షేత్రస్థాయి సమీకరణలతో పటిష్టంగా ఉన్న సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఆయనకు అసలైన రాజకీయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాయి. రాజకీయ పరిణతి, అనుభవం లేని జెన్‌జీ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని నాయకుడిగా చలామణి అవ్వాలనుకుంటున్న దీప్కేకు.. అసలు సిసలు రాజకీయాల ముందూ వెనుక తెలిసొచ్చే రోజులు ముందు ముందు ఖచ్చితంగా వస్తాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

