విజయ్ ముఖ్యమంత్రి కాకుండా రజనీకాంత్ చాలా ప్రయత్నించారని రెండు ద్రవిడ పార్టీలను కలిపేందుకు ప్రయత్నించారని తమిళనాడుతో పాటు దేశం అంతా జరుగుతున్న ప్రచారంపై రజనీకాంత్ నోరు విప్పారు.
ఈ ప్రచారం సోషల్ మీడియా పుకార్లే అనుకుని ఆయన లైట్ తీసుకున్నారు.కానీ అవి రాను రాను పెరిగిపోవడంతో ఆయన అత్యవసరంగా చెన్నైలోని తన నివాసంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు
మౌనంగా ఉంటే అబద్ధాలే నిజాలుగా ప్రచారమయ్యే ప్రమాదం ఉందని, అందుకే వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశానని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే నేత ఎం.కె. స్టాలిన్‌ను తాను కలవడంపై వస్తున్న విమర్శలపై రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం నేను స్టాలిన్‌ను కలవడంపై కొందరు అనవసర రాజకీయం చేస్తున్నారు. మా మధ్య ఉన్న స్నేహం, బంధం రాజకీయాలకు, గెలుపోటములకు అతీతమైనది. కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోవడం నన్ను నిజంగా బాధించింది. ఆ బాధతోనే ఒక స్నేహితుడిగా ఆయనను కలిసి పరామర్శించాను అని రజనీకాంత్ పేర్కొన్నారు. అక్కడ ఎటువంటి రాజకీయ కూటముల గురించి చర్చ జరగలేదన్నారు.
తమిళ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సూపర్ స్టార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక విషయంలో అనవసరంగా మాట్లాడి వివాదాలు సృష్టించేంత చౌకబారు, తక్కువ స్థాయి వ్యక్తిని రజనీకాంత్ కాదని అందరూ గుర్తుంచుకోవాలి. నాకంటూ కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును నేను గౌరవిస్తాను. కొత్త ముఖ్యమంత్రి విజయం సాధించిన వెంటనే, ప్రజాస్వామ్య స్ఫూర్తితో నేను ఆయనకు ఫోన్ చేసి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశాను అని ఆయన వివరించారు. విజయ్ సాధించింది అసాధారణ విజయమన్నారు. విజయ్ తన కంటే 28 ఏళ్ల చిన్నవాడని ఆయన గొప్ప విజయం సాధించారని అన్నారు. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, గెలిచిన ప్రభుత్వానికి అభినందనలు తెలపడం, ఓడిన మిత్రుడిని పరామర్శించడం మానవత్వమని, దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని రజనీకాంత్ స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో లేనని.. విజయ్‌పై ఎలాంటి వ్యతిరేక భావం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.
రజనీకాంత్ ఇచ్చిన ఈ వివరణతో తమిళనాడులో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు బ్రేక్ పడింది. రాజకీయాలు ఎలా ఉన్నా, వ్యక్తిగత బంధాలకు తాను ఇచ్చే ప్రాధాన్యతను ఆయన మరోసారి నిరూపించుకున్నారు.

