ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 11 లక్షల మందికి పైగా అమాయక డిపాజిటర్లను రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్ కుంభకోణం కేవలం ఒక ఆర్థిక నేరం కాదు. అది లక్షలాది సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆత్మగౌరవం, జీవితకాల శ్రమతో ముడిపడిన సమస్య.
సుమారు రూ. 6,300 కోట్లకు పైగా సాగిన ఈ దగాపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బాధితులకు ఆరు నెలల గడువులోగా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశిస్తూ ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ఈ సంకల్పం నెరవేరాలంటే గతంలో ఎదురైన రాజకీయ రాజీలు, న్యాయపరమైన వ్యూహాత్మక ఆటంకాలను అంతే గట్టిగా అధిగమించాల్సి ఉంటుంది.
ఆస్తులు వేలం వేస్తే బాధితులందరికీ వడ్డీతో సహా నగదు
వ్యవస్థాగతంగా చూస్తే, అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులు భౌతికంగా లభ్యతలోనే ఉన్నాయి. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( జప్తు చేసిన రూ. 3,950 కోట్ల విలువైన స్థిరాస్తులు వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 7,000 కోట్లకు పైనే ఉండవచ్చు. పిఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సీఐడీ పరిధిలోకి తీసుకురావడంలో కీలక పురోగతి లభించింది. ఈ భూములు, హాయ్‌లాండ్ వంటి వాణిజ్య సముదాయాల విలువ నేడు మార్కెట్‌లో భారీగా పెరిగింది. కాబట్టి, ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా ఈ ఆస్తులను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ ధరల ప్రకారం కాకుండా, ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధరల ఆధారంగా వేలం వేస్తే.. బాధితుల అసలు మొత్తంతో పాటు వడ్డీతో సహా చెల్లించడానికి సరిపడా నిధులు సమకూరుతాయి. కానీ, ఈ వేలం ప్రక్రియ వేగవంతం కాకుండా న్యాయపరమైన చిక్కులు సృష్టించేందుకు తెరవెనుక శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
అగ్రిగోల్డ్ ఓనర్ల కన్నా ఎక్కువగా మోసం చేసిన జగన్
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ సమస్యను రాజకీయానికివాడుకుని మోసం చేశారు. పాదయాత్రలో అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటాం అని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి, ఐదేళ్ల పాలనలో రూపాయికూడా ఇవ్వలేదు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం రూ. 20,000 లోపు డిపాజిట్లు ఉన్న వారికి చెల్లించేందుకు రెడీ చేసిన మొత్తంలో కొంత మొత్తం తగ్గించి రూ. 900 కోట్లు విదిల్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన డిపాజిటర్లను గాలికొదిలేశారు. అంతకంటే ఘోరంగా, అగ్రిగోల్డ్ ఆస్తుల దర్యాప్తును పర్యవేక్షించిన అప్పటి సీఐడీ అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఆస్తుల విలువను తక్కువ చేసి చూపి, క్విడ్-ప్రో-కో పద్ధతిలో లబ్ధి పొందారనే ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల మేనేజ్‌మెంట్ వైఖరికి అప్పటి ప్రభుత్వ ఉదాసీనత తోడవడంతోనే విచారణ ఇన్నేళ్లు నలిగింది.
ఇప్పుడు కూడా వైసీపీ అడ్డం పడుతుంది!
ప్రస్తుతం కూడా కూటమి ప్రభుత్వం ఆరు నెలల డెడ్‌లైన్ పెట్టగానే.. వైసీపీ ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆస్తుల లిక్విడేషన్‌ను ఆలస్యం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని, తద్వారా రాజకీయంగా బురదజల్లాలని వైసీపీ చూస్తోంది. అయితే, ప్రభుత్వం ఇలాంటి కోర్టు స్టేలు, తప్పుడు ఆరోపణలకు వెరవకూడదు. అగ్రిగోల్డ్ మేనేజ్‌మెంట్ నుంచి బ్రాండ్ గ్యారెంటీలు డిమాండ్ చేస్తూనే, కోర్టులలో ప్రభుత్వ పక్షాన సమర్థవంతమైన కౌంటర్లు దాఖలు చేసి న్యాయపరమైన అడ్డంకులను తొలగించాలి. రాజకీయ ప్రతీకారాలు, విపక్షాల ఆటంకాలను పక్కన పెట్టి, ఈ ఆరు నెలల కాలాన్ని ఒక యజ్ఞంలా భావించి ప్రభుత్వం ముందుకు సాగాలి. దశాబ్ద కాలంగా న్యాయం కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్న బాధితులకు న్యాయం చేయాలి. ఈ అగ్నిపరీక్షలో కూటమి ప్రభుత్వం గెలిస్తే, అది కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదు, అన్యాయానికి గురైన సామాన్యుడికి సాధించి పెట్టిన విజయం . ఓ రాజకీయ పార్టీకి అదే అసలైన విజయం.

