అగ్రిగోల్డ్ బాధితులకు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న న్యాయం త్వరలోనే సాకారం కాబోతోంది. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
రాబోయే ఆరు నెలల్లోగా బాధితులందరికీ వారి సొమ్ము చెల్లించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన గడువు విధించారు.
బాధితుల క్లెయిమ్స్‌ను వేగంగా పరిశీలించి, చెల్లింపుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన హై-లెవల్ కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఎనిమిది రాష్ట్రాల్లో మొత్తం 19 లక్షల మంది బాధితులు ఉండగా, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 11 లక్షల మంది తమ పెట్టుబడులను కోల్పోయారని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిన సుమారు రూ. 4,141 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయడం ద్వారా డిపాజిట్లను బాధితులకు తిరిగి ఇచ్చే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది.
గత ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో జరిగిన జాప్యం , కొందరు అధికారుల తీరుపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో రూ. 20 వేల లోపు డిపాజిట్ చేసిన దాదాపు 10.40 లక్షల మందికి కొంత మేర న్యాయం జరిగినప్పటికీ, మిగిలిన లక్షలాది మంది బాధితులు ఇప్పటికీ నిరీక్షిస్తున్నారు. తాజా కేబినెట్ నిర్ణయంతో వివాదరహితంగా ఉన్న ఆస్తులను తక్షణమే లిక్విడేట్ చేసి, నిధులను బాధితుల ఖాతాల్లోకి చేర్చేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

