ఈసారి ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ చాలా రసవత్తరంగా మారిపోయింది. 63 మ్యాచ్‌లు జరిగిపోయినా సరే, ప్లే ఆఫ్ కూర్పు ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పటి వరకూ మూడు జట్లే ప్లే ఆఫ్ లో స్థానాలు ఖరారు చేసుకొన్నాయి.
బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్… ప్లే ఆఫ్‌కి దూసుకెళ్లాయి. ఆ ఒక్క స్థానం కోసం ఏకంగా ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. రాజస్థాన్, చెన్నై. ఢిల్లీ, పంజాబ్, కొలకొత్తా.. వీటిలో ఏ జట్టయినా సరే, 4వ స్థానం కైవసం చేసుకోగలదు. అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి. కేవలం ముంబై, లక్నో మాత్రమే ప్లే ఆఫ్ రేసులో లేవు.
కాకపోతే.. ఈ ఐదు జట్లలో రాజస్థాన్‌కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజస్థాన్ మరో రెండు మ్యాచ్‌లు ఆడాలి. రెండిటిలోనూ గెలిస్తే.. నాలుగో స్థానం దక్కించుకోవొచ్చు. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సమీకరణాలు మారిపోతాయి. మిగిలిన జట్లు తదుపరి మ్యాచ్‌లో ఘన విజయాలు సాధించాలి. సో.. ఇక రాబోయే మ్యాచ్‌లన్నీ రసవత్తరమే. ఈరోజు రాజస్థాన్, లక్నో మధ్య మ్యాచ్ వుంది. ఈ పోరులో రాజస్థాన్ గెలిస్తే మిగిలిన జట్లకు అవకాశాలు మరింతగా కుచించుకుపోతాయి. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే.. అన్నింటికీ సమాన అవకాశాలు ఏర్పడతాయి.
మళ్లీ నిరాశ పరిచిన ధోనీ
సోమవారం హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో ధోనీ బరిలోకి దిగుతాడని అంతా అనుకొన్నారు. ఎందుకంటే ఈ సీజన్ లో సొంత మైదానంలో ఆడే చివరి మ్యాచ్ అది. ధోనీ కూడా జట్టుతోనే ఉన్నాడు. కానీ… తుది జట్టులో మాత్రం లేడు. ధోనీ మైదానంలోకి వచ్చినప్పుడు, స్క్రీన్ పై కనిపించినప్పుడు స్టేడియం హోరెత్తిపోయింది. ధోనీ ఫిట్ గానే ఉన్నాడు. ఎందుకో బరిలో దిగడానికి మాత్రం ఇష్టపడడం లేదు. ఈ సీజన్‌లో చెన్నై తన చివరి మ్యాచ్ అహ్మదాబాద్ లో ఆడుతుంది. చెన్నై ఓడితే… ఈ సీజన్ నుంచి నిష్క్రమించినట్టే. తరువాతి సీజన్‌లో ధోనీ ఉండే అవకాశాలే లేవు. కనీసం చివరి మ్యాచ్ లో అయినా తలా బరిలో దిగాలని ఫ్యాన్స్ కోరుకొంటున్నారు. "ధోనీ ఎప్పుడు ఆడాలి అనేది పూర్తిగా తన ఇష్టం. ఈ విషయం మా ప్రమేయం ఏం లేదు" అని యాజమాన్యం చెబుతోంది. ధోనీ ఎందుకు ఆడడం లేదు అనే ప్రశ్నకు కెప్టెన్ రుతురాజ్ దగ్గర కూడా సమాధానం లేకుండా పోయింది. అయితే.. చెన్నైలో మ్యాచ్ అవ్వగానే.. ధోనీ మైదానంలోకి వచ్చి, అభిమానుల్ని ఉత్సాహపరిచాడు. వాళ్లకు అభివాదం చేస్తూ గ్రౌండ్ అంతా తిరిగాడు. మొత్తానికి తన సొంత మైదానంలో ధోనీ మళ్లీ బరిలోకి దిగడు. ఆ అవకాశమే లేదు. ఓరకంగా… నిన్నటి మ్యాచ్ ధోనికి అనధికార వీడ్లోలు అనిపించింది.

