హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెట్టుబడుల సరళి వేగంగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇందులో భాగంగానే, ఒకేసారి కోట్లాది రూపాయలు వెచ్చించి కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసే భారాన్ని తగ్గించుకుంటూ, ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని ఎంచుకుంటున్నారు.
ఈ ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్‌మెంట్ విధానంna .. ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్, ఐటీ పార్క్ లేదా మాల్‌లోని నిర్దిష్ట స్పేస్‌ను ఒకే వ్యక్తి కాకుండా, ఒక గ్రూప్‌గా ఏర్పడి కొంతమంది ఇన్వెస్టర్లు కలిసి కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు, ఐదు కోట్ల రూపాయల విలువైన ఒక ప్రీమియం కమర్షియల్ ఆఫీస్ స్పేస్‌లో ఒక ఐటీ ఉద్యోగి తన బడ్జెట్‌కు తగినట్లుగా రూ. 5 లక్షలు లేదా రూ. 10 లక్షలు మాత్రమే పెట్టుబడిగా పెట్టి, ఆ ప్రాపర్టీలో భాగస్వామి ( కావచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
ఐటీ ఉద్యోగులు ఈ మోడల్‌పై ఇంతగా ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం.. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ అద్దె ఆదాయం వచ్చే కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో అడుగుపెట్టే అవకాశం లభించడమే. సాధారణంగా రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లపై వచ్చే అద్దె ఆదాయం 2 నుండి 3 శాతమే ఉంటే, గేటెడ్ ఐటీ కారిడార్లలోని గ్రేడ్-ఏ కమర్షియల్ ప్రాపర్టీలపై 8 నుండి 10 శాతం వరకు స్థిరమైన అద్దె ఆదాయం లభిస్తుంది. దీనికి తోడు, సదరు ప్రాపర్టీ విలువ పెరిగినప్పుడు వీరికి వచ్చే లాభాల వాటా కూడా పెరుగుతుంది. హోమ్ లోన్ ఈఎంఐల భారం లేకుండా అదనపు ఆదాయం సంపాదించడానికి ఇదొక స్మార్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
భారతదేశంలో సెబీ నియంత్రణల పరిధిలోకి స్మాల్ అండ్ మీడియం రీట్స్ తీసుకురావడంతో ఈ రకమైన పెట్టుబడులకు చట్టపరమైన రక్షణ , పారదర్శకత మరింత పెరిగాయి. హై-రిస్క్ ఉండే స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీల కంటే స్థిరమైన రియల్ ఎస్టేట్ ఆస్తిపై హక్కులు ఉండటం ప్లస్ పాయింట్. కమర్షియల్ హబ్‌లలో ఈ తరహా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్‌మెంట్లు మరింత విస్తృతం కానున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

