అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన లంచం , మోసం కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. అదానీపై ఉన్న అభియోగాలను వెనక్కి తీసుకోవాలని అమెరికా న్యాయ శాఖ యోచిస్తోంది.
బైడెన్ హయాంలో నమోదైన ఈ కేసును, ప్రస్తుత ట్రంప్ యంత్రాంగం ఉపసంహరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి ఆయన దాదాపుగా లక్ష కోట్ల ఖర్చు పెట్టాలని నిర్ణయించారు.
రూ. లక్ష కోట్ల ఇన్వెస్ట్ మెంట్ ఆఫర్
అదానీ తరపున వాదిస్తున్న కొత్త లాయర్ రాబర్ట్ గియుఫ్రా అమెరికా న్యాయ శాఖ అధికారులతో జరిపిన సమావేశంలో ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఒకవేళ అదానీపై ఉన్న కేసులను కొట్టివేస్తే, ఆయన అమెరికా ఆర్థిక వ్యవస్థలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, తద్వారా 15,000 ఉద్యోగాలకల్పనకు హామీ ఇచ్చారు. అంటే మన రూపాయల్లో దాదాపుగా లక్ష కోట్లు అనుకోవచ్చు. అదానీ నియమించుకున్న ఈ లాయర్ గియుఫ్రా, స్వయంగా అధ్యక్షుడు ట్రంప్‌కు కూడా వ్యక్తిగత న్యాయవాది కూడా కావడంతో డీల్ జరిగిపోతుందని అనుకుంటున్నారు.
కేసు మూసేస్తారా?
న్యాయ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో అదానీ బృందం దాదాపు 100 స్లైడ్లతో కూడిన ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇందులో ప్రాసిక్యూటర్ల దగ్గర సరైన సాక్ష్యాలు లేవని, అలాగే భారతీయ పౌరులపై కేసు పెట్టే అధికారం అమెరికాకు లేదని వారు వాదించారు. అయితే, ఆ ప్రజెంటేషన్‌లో ఒక స్లైడ్‌లో మాత్రం కేసు కొట్టేస్తే 10 బిలియన్ల ఇన్వెస్ట్‌మెంట్ అనే ఆఫర్‌ను ఉంచడం చర్చనీయాంశమైంది. ప్రాసిక్యూటర్లు అధికారికంగా ఈ పెట్టుబడికి, కేసు పరిష్కారానికి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ, ఈ ఆఫర్ పట్ల కొందరు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.
అసలు కేసు ఏమిటి?
గతంలో అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై భారీ ఆరోపణలు వచ్చాయి. భారత్‌లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత రాజకీయ నేతలకు , అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చారని, ఈ విషయాన్ని అమెరికా పెట్టుబడిదారులకు దాచిపెట్టి నిధులు సేకరించారని 2024లో కేసు నమోదైంది. ఈ పరిణామం ఇప్పుడు అమెరికా, భారత రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విదేశీ వ్యాపారవేత్తలు అమెరికాలో పెట్టుబడుల పేరుతో తమపై ఉన్న క్రిమినల్ కేసుల నుండి విముక్తి పొందవచ్చా అనే చర్చ మొదలైంది. ఒకవైపు అదానీ గ్రూప్ ఈ కేసు నుండి బయటపడితే గ్లోబల్ మార్కెట్‌లో వారి ప్రతిష్ట మళ్ళీ పెరుగుతుందని భావిస్తున్నాయి. మొత్తానికి ఈ వారం లేదా వచ్చే వారంలో అదానీపై కేసుల ఉపసంహరణకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అదానీ తప్పు చేసి.. రూ. లక్ష కోట్లతో తప్పించుకున్నట్లు అవుతుంది.

