పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగించుకుని వస్తూ తైవాన్ రక్షణపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
తైవాన్‌కు ఆయుధాల సరఫరాను చైనాతో చర్చలకు ఒక నెగోషియేటింగ్ చిప్ గా అభివర్ణించడం, 9,500 మైళ్ల దూరం ప్రయాణించి అమెరికా సైన్యం యుద్ధం చేయాలా? అంటూ ఆయన ప్రశ్నించడం అంతర్జాతీయ విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. కేవలం వ్యాపార దృక్పథంతో అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను శాసించాలనుకునే ట్రంప్ వైఖరి, శతాబ్ద కాలంగా అమెరికా కాపాడుకుంటూ వస్తున్న అగ్రరాజ్య పరువు ను చైనా ముందు గంగలో కలిపేలా ఉంది.
తైవాన్‌కు రక్షణ అమెరికాకు చట్టబద్ధమైన విధి
1979 నాటి తైవాన్ రిలేషన్స్ యాక్ట్, రోనాల్డ్ రీగన్ హయాంలోని ఆరు హామీల ప్రకారం.. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన సైనిక సహకారాన్ని అందించడానికి అమెరికా చట్టబద్ధంగా కట్టుబడి ఉంది. దశాబ్దాలుగా వాషింగ్టన్ అనుసరిస్తున్న విధానం చైనాను తైవాన్‌పై దాడి చేయకుండా నిరోధించగలిగింది. అయితే, ప్రస్తుతం నిలిచిపోయిన 14 బిలియన్ డాలర్ల రక్షణ ప్యాకేజీ భవిష్యత్తు చైనా ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని ట్రంప్ ప్రకటించడం ద్వారా, అమెరికా తన మిత్రదేశాల నమ్మకాన్ని తాకట్టు పెడుతోందనే వాదన బలపడుతోంది. ఇది బీజింగ్ దూకుడుకు అమెరికా మోకరిల్లడమే.
మిత్రదేశాలనేవి అమెరికాకు లేకుండా చేస్తున్న ట్రంప్
ట్రంప్ చేస్తున్న ఈ తైవాన్ జూదం తీవ్రమైన ముప్పుకు దారితీసే అవకాశం ఉంది. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్-తే స్వతంత్రం కోసం ప్రయత్నిస్తూ యుద్ధాన్ని కొని తెచ్చుకుంటున్నారనే తరహాలో ట్రంప్ మాట్లాడటం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మార్గాన్ని మరింత సుగమం చేసినట్లవుతుంది. కేవలం వ్యాపార ఒప్పందాలు, సుంకాల చుట్టూనే విదేశీ విధానాన్ని తిప్పే ట్రంప్ లావాదేవీల రాజకీయం, చైనాకు ఒక సువర్ణావకాశాన్ని ఇస్తోంది. అమెరికా తన రక్షణ హామీల నుంచి వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు వెళ్తే, అది కేవలం తైవాన్ మాత్రమే కాదు.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ వంటి ఇతర అమెరికా మిత్రదేశాల భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంది.
ట్రంప్ బలహీనతను వాడుకుంటున్న చైనా
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సెమీకండక్టర్ చిప్స్ 90 శాతం పైగా AI , మిలిటరీ చిప్స్ తైవాన్‌లోనే తయారవుతున్నాయి. ఒకవేళ అమెరికా బలహీనతను ఆసరాగా చేసుకుని చైనా గనుక తైవాన్‌ను ఆక్రమిస్తే, గ్లోబల్ టెక్నాలజీ , సప్లై చైన్ మొత్తం బీజింగ్ గుప్పిట్లోకి వెళ్తుంది. ట్రంప్ అనుకుంటున్నట్లు ఇది కేవలం ఒక ద్వీపానికి సంబంధించిన సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. చైనా బెదిరింపులకు భయపడి లేదా కేవలం కొన్ని బిలియన్ డాలర్ల వాణిజ్య రాయితీల కోసం తైవాన్‌ను బలిపెట్టాలని చూస్తే.. అది అంతర్జాతీయంగా అమెరికా నైతిక నాయకత్వ పతనానికి , చైనా నయా-సామ్రాజ్యవాద విజయానికి అధికారిక ముద్ర వేసినట్లే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ట్రంప్ గుర్తించడం లేదు.

