తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తలపతి విజయ్ అమ్మ క్యాంటీన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ ఉపాహార కేంద్రాల పేరుతో నడుస్తున్న ఈ క్యాంటీన్లను పూర్తిగా ఆధునీకరించాలని, వాటి రూపురేఖలను మార్చాలని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వాల హయాంలో ప్రారంభమైనప్పటికీ, నిరుపేదల ఆకలి తీర్చే ఇటువంటి ప్రజా ఉపయోగకరమైన పథకాలను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న క్యాంటీన్ల మౌలిక వసతులను భారీగా మెరుగుపరచనున్నారు. భవనాల మరమ్మతులు, డైనింగ్ ఏరియాల ఆధునీకరణతో పాటు కిచెన్‌లలో అవసరమైన కొత్త పరికరాలను తక్షణమే కొనుగోలు చేయాలని సీఎం విజయ్ అధికారులను ఆదేశించారు. చాలా చోట్ల మిక్సీలు, గ్రైండర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు సగానికి పైగా పాడైపోయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్లు వచ్చిన నివేదికలతో యుద్ధప్రతిపాదికన ఈ కొనుగోళ్లు జరపాలని స్పష్టం చేశారు.
ఈ ఆధునీకరణ ప్రక్రియలో ఆహార నాణ్యత, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రతి క్యాంటీన్‌లోనూ అత్యంత శుభ్రమైన వాతావరణంలో వంటలు జరిగేలా చూడాలని, పేదలకు అందించే భోజనం నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని హెచ్చరించారు. నిరుపేదలు, రోజువారీ కూలీలు, విద్యార్థులు ఎక్కువగా ఆశ్రయించే ఈ కేంద్రాల్లో పౌష్టికాహారం సక్రమంగా అందేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 620 అమ్మ క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. నిజానికి అమ్మ క్యాంటీన్లు అన్నాడీఎంకే హయాంలో పెట్టినా.. స్టాలిన్ వాటి జోలికి వెళ్లలేదు. కనీసం పేరు కూడా మార్చలేదు. ఆ క్యాంటీన్లను విజయవంతంగా నడిపించారు. ఇప్పుడు విజయ్ వాటిని ఆధునీకరించాలని మాత్రం ఆదేశాలిచ్చారు.

