తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కొత్త కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కించుకుని చక్రం తిప్పాలని ఆశించిన రెబెల్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి లా మారింది.
విజయ్ మంత్రివర్గంలో అన్నాడీఎంకే తిరుగుబాటు నేతలకు చోటు కల్పిస్తున్నారనే వార్తలు కేవలం ఊహాగానాలేనని, వాటిలో ఎలాంటి నిజం లేదని టీవీకే అధికారికంగా ప్రకటించింది.
వాస్తవానికి విజయ్ ప్రభుత్వంలో ఈ రెబెల్ నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలనే యోచన మొదట్లో సాగినప్పటికీ.. కూటమిలోని మిత్రపక్షాలైన కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి , లెఫ్ట్ పార్టీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. అన్నాడీఎంకే నుంచి తిరుగుబాటు చేసిన వారికి అత్యున్నత పదవులు ఇస్తే తాము ఊరుకునేది లేదని, అది కూటమి ధర్మానికి విరుద్ధమని స్పష్టం చేస్తూ విజయ్‌పై గట్టి ఒత్తిడి తెచ్చాయి. మిత్రపక్షాల నుంచి ఎదురైన ఈ తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన విజయ్, చివరికి వారికి మంత్రి పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు.
టీవీకే అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో సదరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారి వెనుక ఉన్న కీలక నేతలు ఇప్పుడు అటూ ఇటూ కాకుండా పొలిటికల్ ఐసోలేషన్‌లో పడిపోయారు. అటు అధికారికంగా టీవీకే గూటికి చేరి పదవులు పొందే అవకాశం మూసుకుపోగా.. ఇటు మాతృసంస్థ అయిన అన్నాడీఎంకేలో ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేయడం వల్ల అక్కడ కూడా తిరిగి స్థానం సంపాదించుకునే పరిస్థితి లేదు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వీరిని చేర్చుకోవడానికి అన్నాడీఎంకే అధినాయకత్వం ఎంతమాత్రం సిద్ధంగా లేదు.
సదరు నేతలు అటు టీవీకేలో చేరలేక, ఇటు అన్నాడీఎంకేలో ఉండలేక తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయారు. వారిపై అనర్హతా వేటు కోసం పళనిస్వామి పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి.

