ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పనుల్లో వేగం పెంచుతూ ముందుకు సాగుతుంటే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం వాటిని చూసి తట్టుకోలేకపోతున్నారు.
దశాబ్దాల కల అయిన ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపు ప్రారంభమవ్వడం, ఆ ప్రాంత ప్రజల్లో ఆనందోత్సాహాలు నింపడం ఆయనకు ఏ మాత్రం నచ్చడంలేదు. కూటమి ప్రభుత్వ పనితీరుకు వస్తున్న ప్రజాదరణను పక్కదారి పట్టించేందుకే, ప్రతి శుభవార్తపైనా ఏదో ఒక సాకు వెతుక్కుంటూ క్రెడిట్ రాజకీయం చేసేందుకు ఆయన తాపత్రయపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల విడుదలపై జగన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ నవ్వులపాలవుతోంది. పురుషోత్తపట్నం పంపులు ఇప్పటికే ఉన్నవేనని, పోలవరం ఎడమ కాలువ కూడా పాతదేనని తేలికగా తీసిపారేసే ప్రయత్నం చేశారు. నీళ్లు ఇచ్చినంత మాత్రాన ఇంత పబ్లిసిటీ ఎందుకంటూ, కాలువల పనుల్లో 79 శాతం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారు. నిజంగానే కాలువలు, పంపులు సిద్ధంగా ఉంటే.. ఐదేళ్ల పాటు సీఎంగా అధికారంలో ఉన్న జగన్ ఆ మిగిలిన పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు.
ఐదేళ్ల సొంత పాలనలో పోలవరం పనులను అటకెక్కించి, ఎడమ కాలువపై కనీసం ఒక తట్ట మట్టి కూడా వేయకుండా నిర్లక్ష్యం చేసిన చరిత్ర జగన్‌ది అని కూటమి నాయకులు బయట పెడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సాగు, తాగునీటి కోసం అల్లాడుతున్నా పట్టించుకోని ఆయన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టుదలతో కాలువ పనుల అడ్డంకులను తొలగించి జలాలను పారిస్తుంటే సహించలేకపోతున్నారు. తమ హయాంలో చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్సార్ పేరును తెరపైకి తెచ్చి రాజకీయం చేయాలని చూస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో హామీలతో పాటు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తుండటంతో వైఎస్సార్‌సీపీకి మైండ్ బ్లాక్ అవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పనితీరును చూసి ప్రజలు మెచ్చుకుంటుంటే, ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు ఖాతాలోకి వెళ్తుందనే భయంతోనే జగన్ ఇలాంటి విమర్శలకు దిగుతున్నారని స్పష్టమవుతోంది. పనులు చేయడం చేతకాక, చేసేవారిని చూసి ఓర్వలేక క్రెడిట్ కోసం ఆరాటపడటం జగన్ నైజమని టిజన్లు ఎద్దేవా చేస్తున్నారు

