తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ రోజుకో సినిమాటిక్ నిర్ణయంతో తన మార్క్ చూపిస్తున్నారు. తాజా రాష్ట్రంలో లంచగొండితనాన్ని వేళ్లతో సహా పెకిలించేందుకు ఆయన ఒక వినూత్నమైన పథకాన్ని ప్రకటించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారి లేదా ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే, దానిని వీడియో తీసి సాక్ష్యంగా సమర్పించిన పౌరులకు 1 లక్ష నగదు బహుమతి అందజేస్తామని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
అవినీతిపై యుద్ధం ప్రకటించిన విజయ్ ప్రభుత్వం, ఇందుకోసం ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను, మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. సామాన్య ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలను ఈ ప్లాట్‌ఫామ్‌లపై అప్‌లోడ్ చేయవచ్చు. ఆ వీడియో సాక్ష్యం నిజమని నిర్ధారణ అయితే, ఫిర్యాదు చేసిన వారికి 24 గంటల్లోనే బహుమతి సొమ్మును అందజేయడమే కాకుండా, సదరు లంచగొండి ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేసి కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వ సేవలలో పారదర్శకతను పెంచడం, సామాన్యుడిని అవినీతి రహిత పాలనలో భాగస్వామిని చేయడం. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప, లంచాల కోసం వేధించే వారు కాకూడదు అని విజయ్ స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి పౌరుడిని ఒక నిఘా నేత్రం గా మార్చాలని, తద్వారా లంచం అడగాలంటేనే అధికారులు భయపడే పరిస్థితి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
యువత ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే, ఈ పథకం దుర్వినియోగం కాకుండా, తప్పుడు వీడియోలు లేదా కక్షపూరిత ఫిర్యాదులను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

