నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం పలు కారణాలతో ఆలస్యం అవుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు.
సాధారణంగా ప్రచారానికి, మీడియాకు, వెండితెరకు దూరంగా ఉండే తేజస్విని.. బాలకృష్ణ నటించిన కొన్ని చిత్రాల నిర్మాణ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. అన్ స్టాపబుల్ షోకి క్రియేటివ్ టీంలో కీలకంగా వ్యవహరించారు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన కోణంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి చేసిన ఓ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో తేజస్విని చూపించిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. పాట బీట్‌కు తగ్గట్టుగా ఆమె చూపించిన టైమింగ్, డ్యాన్స్‌లో కనిపించిన గ్రేస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చాలా సహజంగా, ఎలిగెంట్‌గా స్టెప్స్ వేయడం వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నిజానికి నందమూరి కుటుంబంలో కళల పట్ల ఆసక్తి కొత్త విషయం కాదు. చిన్నప్పటి నుంచే డ్యాన్స్, సంగీతం, కళలకు సంబంధించిన వాతావరణంలో పెరిగిన తేజస్వినికి డ్యాన్స్‌పై మంచి పట్టు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. అయితే ఇప్పటివరకు ఆమె ఆ ప్రతిభను బయటకు చూపించలేదు. అందుకే ఈ వీడియో చూసిన అభిమానులు సర్‌ప్రైజ్ అవుతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఈ వీడియో అనుకోని సర్‌ప్రైజ్‌గా మారింది.

