ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు ఉదయం 11 గంటలకు అత్యంత ఆసక్తికరమైన పొలిటికల్ షో ' ప్రారంభం కానుంది. ఒకే సమయానికి అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేశారు.
జగన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ప్రకటించగా, సరిగ్గా అదే సమయానికి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బాలినేని కూడా ప్రెస్‌మీట్ ఉందని మీడియాకు పిలుపునిచ్చారు.
సాక్షి లో బాలినేనిని టార్గెట్ చేస్తూ వచ్చిన తీవ్రమైన ఆరోపణల కథనాలకు సమాధానంగా.. జగన్ రెడ్డి తన ఆస్తులను, వ్యాపారాలను ఎలా లాక్కున్నారో క్షేత్రస్థాయి ఆధారాలతో వివరించడానికి బాలినేని సిద్ధమయ్యారని అంటున్నారు.
ఈ రెండు ప్రెస్‌మీట్ల నిర్వహణ శైలిలోనే అసలైన ట్విస్ట్ దాగుంది. ఎప్పటిలాగే జగన్ రెడ్డి ప్రెస్‌మీట్ నేరుగా లైవ్ ప్రసారం కాదు. ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డింగ్ పూర్తి చేసుకుని, తమకు అనుకూలంగా ఉండేలా ఎడిటింగ్ పనుల్లో టీమ్ నిమగ్నమైంది. అది ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు ఛానళ్లకు విడుదల చేస్తారు. దీనికి భిన్నంగా బాలినేని శ్రీనివాస రెడ్డి మాత్రం మీడియా ప్రతినిధుల సమక్షంలో లైవ్ గానే ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. జగన్ ముందే రికార్డ్ చేసిన స్క్రిప్ట్‌తో వస్తుంటే, బాలినేని మాత్రం లైవ్‌లోనే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ జగన్ రెడ్డి అక్రమాలను బట్టబయలు చేయబోతున్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది.
ఒకే ముహూర్తానికి బావ-బావమరుదుల సవాల్ ప్రతిసవాళ్లు ఊపందుకోవడంతో తెలుగు రాష్ట్రాల మీడియా కళ్లు ఈ రెండు ప్రెస్‌మీట్లపైనే ఉన్నాయి. సాక్షి పత్రిక ఆరోపణలకు బాలినేని ఇచ్చే పక్కా లోకల్ కౌంటర్లు ఏ రేంజ్‌లో ఉంటాయోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జగన్ రెడ్డి రికార్డెడ్ వెర్షన్ ప్రసారమయ్యే లోపే బాలినేని లైవ్ ప్రసంగం సోషల్ మీడియాను, రాజకీయ వేదికలను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

