Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాల్కసుమన్ అరెస్ట్

బాల్కసుమన్ అరెస్ట్

Telugu 360 1 week ago

భారత రాష్ట్ర సమితి కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనల్లో భాగంగా ఉగ్రరూపం దాల్చాలని, ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టాలని, రైలు పట్టాలు కోసేయాలంటూ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ఒక వీడియో వైరల్ అయింది.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నాంపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గత మూడు రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన పోలీసులకు దొరకకుండా బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లోనే ఉండిపోయారు. దీంతో పోలీసులు తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టి, ఆయన బయటకు రాకుండా పహారా కాశారు. శనివారం నాడు పోలీసులు లోపలికి వెళ్లైనా సరే ఆయనను అరెస్ట్ చేస్తారనే ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.

శనివారం మధ్యాహ్నం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులే లోపలికి వస్తారనుకున్న తరుణంలో, బాల్క సుమనే స్వయంగా తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ వేచి ఉన్న పోలీసుల వాహనం ఎక్కే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తోందని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.

అనంతరం ఆయన పోలీసులతో కలిసి వాహనంలో వెళ్లడంతో గత మూడు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెరపడింది. సుమన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టుతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా మోహరించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360