కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తేనే బాధితురాలికి న్యాయం జరుగుతుదంని కేటీఆర్ అన్నారు. ఆదివారం ఎల్‌బీ నగర్‌లో నిర్వహించిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రిమండలి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నిరంతరం చెప్పే బేటీ బచావో - బేటీ పడావో అనేది కేవలం ఒక చౌకబారు నినాదానికే పరిమితమైందా అని ఆయన ప్రశ్నించారు.
దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రి కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే దుస్థితి రావడం యావత్ దేశానికే అవమానకరమని కేటీఆర్ మండిపడ్డారు. మైనర్ బాలికకు అన్యాయం చేసిన తన కొడుకును చట్టానికి దొరకకుండా దాదాపు తొమ్మిది రోజుల పాటు దాచిపెట్టింది స్వయంగా కేంద్ర మంత్రేనని ఆయన ఆరోపించారు. అంతటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి పదవిలో కొనసాగితే, విచారణాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి కేసును నీరుగార్చే ప్రమాదం ఉందని, అందుకే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించకపోతే పోక్సో కేసు విచారణ సజావుగా సాగదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి, కేసును దారి మళ్లించడానికి హనీ ట్రాప్ అనే తప్పుడు కథనాలను సృష్టించారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరూ కలిసి మీడియాను మనీ ట్రాప్ లో పడేసి, ఈ ఘోర కలికానికి సంబంధించిన వార్తలు బయటకు రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పీఠాల అండతో బాధిత బాలిక కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసినా, వెనకడుగు వేయకుండా నిలబడిన ఆ తల్లి ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇలాంటి తీవ్రమైన కేసుల్లో నిందితులను రక్షించడం తెలంగాణకే కాదు, దేశానికే పెద్ద మాయని మచ్చని కేటీఆర్ విమర్శించారు. ఒకవేళ ఇప్పుడే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే, భవిష్యత్తులో ఏ ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగినా చట్టాన్ని నమ్మి ముందుకు వచ్చే ధైర్యం చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలి తరపున మొదటి నుంచి గట్టిగా పోరాడిన బీఆర్ఎస్ మహిళా విభాగం , పార్టీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. లొంగుబాటు, అరెస్టుల పేరుతో సాగుతున్న హైడ్రామాను పక్కనబెట్టి బాధితురాలికి సంపూర్ణ న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని ఆయన స్పష్టం చేశారు.

