తెలంగాణ రాజకీయ వాతావరణం ఇప్పుడు బండి సంజయ్ చుట్టూ తిరుగుతోంది. ఆయన కుమారుడిపై నమోదైన తాజా పోక్సో కేసును అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేటీఆర్ తీవ్రస్థాయిలో వ్యూహాత్మక దాడికి దిగారు.
వ్యక్తిగత లేదా కుటుంబపరమైన పొరపాట్లను రాజకీయంగా వాడుకుని, ప్రత్యర్థిని నైతికంగా దెబ్బతీయడం ద్వారా తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు బ్రేకులు వేయాలనేది గులాబీ దళం తక్షణ వ్యూహంగా కనిపిస్తోంది. బండి సంజయ్‌ని పదవి నుంచి తప్పించాలంటూ సాగుతున్న ఈ దూకుడు వెనుక కేవలం ఒక ఉదంతం మాత్రమే లేదు, దీని వెనుక పెద్ద రాజకీయ లెక్కే దాగి ఉందని అనుకోవచ్చు.
బండి సంజయ్‌కు మళ్లీ పగ్గాలిస్తే బీజేపీదే దూకుడు
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ క్రమంగా బీజేపీ వైపు మళ్లుతోందనేది గత ఎన్నికల ఫలితాలు, క్షేత్రస్థాయి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు బండి సంజయ్ అనుసరించిన దూకుడు, హిందుత్వ సెంటిమెంట్ రాజకీయాలే ప్రధాన కారణమని కేసీఆర్, కేటీఆర్ బలంగా నమ్ముతున్నారు. మళ్లీ బండి సంజయ్‌కు పగ్గాలు దక్కితే రాజకీయం మారిపోతుంది. బీసీ సెంటిమెంట్ తో పాటు అన్నీ కలసి వస్తాయి. గతంలో బీజేపీని ప్రజాదరణ వైపు నడిపించిన కీలక నేతను గనుక డిఫెన్స్‌లో పడేయగలిగితే, ఆ పార్టీ క్యాడర్ స్థైర్యం దెబ్బతింటుందని, తద్వారా జారిపోయిన తమ ఓటు బ్యాంక్‌ను తిరిగి దక్కించుకోవచ్చని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని అనుకోవచ్చు.
భగీరథ్ కేసును టాప్ ప్రయారిటీగా తీసుకున్న కేటీఆర్
అందుకే బీఆర్ఎస్ , కేటీఆర్ సోషల్ మీడియా కూడా కూడా ఈ అంశాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఒక బలమైన జాతీయ పార్టీ కేవలం ఒక్క నాయకుడి చుట్టూనే తిరుగుతుందని, ఆయనను దెబ్బకొడితే ఇక కోలుకోదని అనుకోవడం రాజకీయ అత్యాశే అవుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు కేవలం బండి సంజయ్ మాత్రమే ముఖచిత్రంగా ఉన్నా, నేడు తెలంగాణలో బీజేపీ ఒక బలమైన వ్యవస్థగా రూపాంతరం చెందింది. క్షేత్రస్థాయిలో కేడర్, ఇతర కీలక నాయకులు పుట్టుకొచ్చారు. కాబట్టి వ్యక్తిగత వివాదాలు నాయకుడి ప్రతిష్ఠపై తాత్కాలికంగా ప్రభావం చూపవచ్చు కానీ, ఒక సిద్ధాంతంతో నడిచే పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడం అంత సులువు కాదని అంటున్నారు.
బండి సంజయ్‌ను ఎంత మేర అణిచివేయగలరు?
ఈ రాజకీయ చదరంగంలో బాధితులకు న్యాయం జరగడం కంటే రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మారిందన్న అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయి నిజానిజాలు తేల్చాల్సి ఉండగా, దానిని రాజకీయ సమాధికి సాధనంగా మార్చుకోవాలని చూడడం ప్రజాస్వామ్య పద్ధతి అనిపించుకోదని అంటున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రయత్నాలు బండి సంజయ్‌ను ఎంతవరకు కట్టడి చేస్తాయనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ, తెలంగాణ ఓటర్లు కేవలం భావోద్వేగాలను, వ్యక్తిగత వివాదాలను మాత్రమే చూసి ఓట్లు వేసే పరిస్థితి దాటిపోయారని.. వారు క్షేత్రస్థాయి రాజకీయ ప్రత్యామ్నాయాలను గమనిస్తున్నారని బీజేపీ సానుభూతిపరులు అంటున్నారు.

