Dailyhunt
BCCI సీరియస్‌: అమ్మాయిలతో పనేంటి?

BCCI సీరియస్‌: అమ్మాయిలతో పనేంటి?

Telugu 360 1 week ago

ఎందుకో ఈ ఐపీఎల్ సీజన్ వివాదాల చుట్టూ నడుస్తోంది. ఆటగాళ్ల, సపోర్టింగ్ స్టాఫ్‌ ప్రవర్తన తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నామధ్య రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కాడు.

అదో పెద్ద గొడవైంది. అదే జట్టుకు చెందిన మేనేజర్ రోమీ బిందర్ డగౌట్ లో మొబైల్ మాట్లాడుతూ కనిపించాడు. ఆ తరవాత యాజమాన్యం రోమీకి క్లాస్ పీకింది. ఇప్పుడు మరో వ్యవహారం బయటకు వచ్చింది.

కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ పేరుతో అమ్మాయిల్ని వెంట బెట్టుకొని తిరుగుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తన ప్రేయసి మహీకాతో కలిసి తిరిగేస్తున్నాడు. హార్దిక్ బస చేస్తున్న హోటెల్ లో, అదే గదిలో మహీకా ఉంటోంది. జైస్వాల్, ఇషాన్ కిషన్‌, అర్ష్‌దీప్ సింగ్ తదితర క్రికెటర్లు కూడా తమ ప్రేయసుల్ని వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. వీళ్లంతా మైదానాల్లోనూ కనిపిస్తున్నారు. ఈ వ్యవహారం బీసీసీఐకి తలనొప్పిగా మారింది. అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే, ఆటపై శ్రద్ధ ఎప్పుడు పెడతారన్నది పెద్ద ప్రశ్న. అంతే కాదు.. జట్టుకి సంబంధించిన కీలకమైన సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని, ఫిక్సింగులకు దారి తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

కొన్నిసార్లు ఆటగాళ్ల ప్రత్యేక అభ్యర్థన మేరకు వారి వారి భార్యలతో కలిసి ప్రయాణం చేసేంత వరకూ మాత్రమే ఫ్రాంచైజీలు అనుమతి ఇస్తాయి. అప్పుడు కూడా బీసీసీఐ నుంచి ఎన్‌.ఓ.సీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ హర్దిక్‌, ఇషాన్‌, జైస్వాల్ వీళ్లంతా తమ సొంత నిర్ణయాల మేరకు నడుచుకొంటున్నారు. ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ ఫ్రాంచైజీ. ఐపీఎల్ కు ఉన్న ఆదరణ మరే టీ20 లీగ్ కూ లేదు. ఐపీఎల్ పేరుతో బీసీసీఐ వేల కోట్లు గడిస్తోంది. దేశ ప్రతిష్ట కూడా ఐపీఎల్ తో ముడి పడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చిన్న తప్పుకీ తావు ఇవ్వకూడదన్నది బీసీసీఐ ఉద్దేశ్యం. అందుకే ఈ వ్యవహారంపై క్రికెట్ పెద్దలు సీరియస్ అవుతున్నారని, హర్దిక్ తో పాటు మిగిలిన క్రికెటర్లకూ ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మిగిలిన వారి మాట ఎలా ఉన్నా.. హార్దిక్ పాండ్యా ప్రవర్తన మాత్రం ముంబై జట్టుకే కాదు, అభిమానులకు కూడా తలవంపులు తెచ్చే విధంగా కనిపిస్తోంది. అసలే ముంబై పుట్టెడు పరాజయాల భారం మోస్తోంది. హార్దిక్ పేలవమైన ఫామ్ లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటపై శ్రద్ద చూపించాల్సింది పోయి, అమ్మాయిలతో తిరగడం అవసరమా? అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. దీనిపై హార్దిక్ తో పాటు ఇతర క్రికెటర్లు ఏమంటారో?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360