తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందు కోసం ఆయన వాడుతున్న కార్డు..
మెంబర్ షిప్ కార్డ్. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేడర్‌ను కాపాడుకోవడం, పార్టీ మెంబర్‌షిప్ తగ్గిపోకుండా చూసుకోవడం ఆ పార్టీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. అందుకే కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు కేటీఆర్ ఒక కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. బీఆర్ఎస్ సభ్యత్వ కార్డు ఉంటే చాలు, రేపు తాము అధికారంలోకి రాగానే ఏ ప్రభుత్వ ఆఫీసుకెళ్లినా, ఏ అధికారి అయినా సెల్యూట్ చేసి మరీ పనులు చేస్తారని చెబుతున్నారు.
పదేళ్ల అధికారంలో కార్యకర్తలకు ఆ పవర్ ఇవ్వలేదా?
నిజానికి బీఆర్ఎస్ పార్టీ అధికారం కొత్తదేమీ కాదు, దశాబ్ద కాలం పాటు తిరుగులేని అధికారంలో కొనసాగిన పార్టీ. అధికారంలో ఉన్న ఆ పదేళ్ల కాలంలో క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలకు ఎంతవరకు మేలు జరిగింది, లబ్ధి ఎవరికి చేరిందనేది కేడర్‌కు బాగా తెలిసిన విషయమే. అప్పట్లో కేవలం కొద్దిమంది ప్రజాప్రతినిధులు, కీలక నేతలు మాత్రమే ప్రభుత్వ లబ్ధిని పొందారనే అసంతృప్తి క్షేత్రస్థాయిలో బలంగా ఉండేది. ఇప్పుడు మళ్లీ అదే కార్యకర్తలను నమ్మించడానికి మెంబర్‌షిప్ కార్డు చూపిస్తే అధికారులు వణికిపోతారనే రేంజ్‌లో బిల్డప్ ఇవ్వడం, కేవలం పార్టీ మనుగడ కోసం ఆడుతున్న మైండ్ గేమ్‌గా చెబుతున్నారు.
సమాంతర ప్రభుత్వాలు నడిపే చాన్స్ ఇస్తారా?
ఈ వ్యాఖ్యల్లోని మరో కోణం సామాన్య పౌరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాము అధికారంలోకి వస్తే చట్టం, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల కంటే పార్టీ కార్డు ఉన్నవారే సుప్రీం అన్నట్లుగా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ప్రభుత్వ అధికారులు కేవలం ఒక రాజకీయ పార్టీ కార్యకర్తకు జవాబుదారీగా ఉండాలన్నట్లుగా సంకేతాలు ఇవ్వడం వల్ల, రేపు అధికారంలోకి వస్తే పార్టీ కేడర్ సమాంతర ప్రభుత్వాలు నడుపుతుందా అనే భయాలు సహజంగానే కలుగుతాయి. ఇటువంటి పిలుపులు కార్యకర్తలను వ్యవస్థలను చేతుల్లోకి తీసుకునే అసాంఘిక శక్తులుగా మార్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం
బలమైన ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ కార్డు కూడా చట్టం కంటే, సామాన్య పౌరుడి కంటే ఎక్కువ కాకూడదు. అధికారులు ప్రజలకు సేవ చేయాలి తప్ప, ఒక పార్టీ కార్యకర్తలకు లోబడి పనిచేయకూడదు. కేటీఆర్ తన పార్టీని, కేడర్‌ను బతికించుకోవడానికి ఇలాంటి ఆకర్షణీయమైన మాటలు చెబుతున్నప్పటికీ తటస్థ ఓటర్లు మాత్రం వ్యతిరేకిస్తారు. కేటీఆర్ అలాంటి ఆఫర్లు ఇచ్చే ముందు నాలుగైదు సార్లు ఆలోచించాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

