Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీహార్ రాజకీయాల్లో  ఇక  బీజేపీ వర్సెస్ పీకే శకం!

బీహార్ రాజకీయాల్లో ఇక బీజేపీ వర్సెస్ పీకే శకం!

Telugu 360 6 days ago

శాబ్దాలుగా బీహార్‌ను ఏలిన లాలూ ప్రసాద్ యాదవ్ , నితీష్ కుమార్ ల మూస రాజకీయాల కథ దాదాపు కంచికి చేరినట్లే కనిపిస్తోంది. బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు బీహార్‌లోని సాంప్రదాయ ప్రాంతీయ పార్టీల పునాదులను తీవ్రంగా కదిలించాయి.

మూడు దశాబ్దాల పాటు సాగిన మండల్ వర్సెస్ కమండల్ సమీకరణలు రాబోయే రోజుల్లో పనిచేయవనే సందేశాన్ని ఈ ఉపఎన్నిక స్పష్టంగా ఇచ్చింది. ఇప్పుడు బీహార్‌ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతూ, అధికార బీజేపీకి నేరుగా ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కుంగిపోతున్న ఆర్జేడీ ఓటు బ్యాంక్

ఆర్జేడీ నమ్ముకున్న సాంప్రదాయ ఓటు బ్యాంక్ గణనీయంగా పడిపోవడం వెనుక ప్రధానంగా జెన్ జీ యువత వైఖరి మార్పే కారణం. పాత తరం నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ శైలిని గానీ, తేజస్వి యాదవ్ అందించే పాతకాలపు సామాజిక న్యాయం నినాదాలను గానీ ప్రస్తుత కొత్త తరం ఓటర్లు విశ్వసించే స్థితిలో లేరు. కేవలం కుల ఆధారిత రాజకీయాల చుట్టూ తిరిగే ఆర్‌జేడీ విధానాలు నచ్చక యువత ఆ పార్టీని తిరస్కరిస్తోంది. బంకీపూర్‌లో ఆర్జేడీ డిపాజిట్ కోల్పోయే స్థాయికి రావడం, కేవలం 14 వేల చిల్లర ఓట్లకు పరిమితమవ్వడం ఆ పార్టీ ఓటు బ్యాంకులో సంభవించిన భారీ విస్తరణ లోపాన్ని, జెన్-జీ యువత దూరమవ్వడాన్ని ఎత్తిచూపుతోంది.

నితీష్ రిటైర్మెంట్‌తో ఉనికి కోల్పోతున్న జేడీయూ

ఇక మరోవైపు జేడీయూ పరిస్థితి నితీష్ కుమార్‌తోనే ముగిసిపోయేలా కనిపిస్తోంది. నితీష్ కుమార్ వయోభారం కారణంగా పరోక్ష రాజకీయాలకు వెళ్లిపోవడం, ఆయన ఆరోగ్యం వంటి కారణాలతో జేడీయూ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడింది. నితీష్ తర్వాత పార్టీని నడిపించే రెండో శ్రేణి బలమైన నాయకత్వం జేడీయూలో లేకపోవడమే ఆ పార్టీకి శాపంగా మారింది. నితీష్ కుమార్ రాజకీయ నిష్క్రమణ, ప్రాభవం తగ్గడంతోనే జేడీయూ తన ఉనికిని కోల్పోయి నిర్వీర్యం కావడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. ఈ శూన్యాన్ని భర్తీ చేసేందుకు అర్బన్, గ్రామీణ ఓటర్లు రెండింటినీ ఆకర్షించే సరికొత్త నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నారు.

ప్రశాంత్ కిషోర్ ఒకే ఒక్క విశ్వసనీయ ప్రత్యామ్నాయం

ఈ పరిణామాలన్నింటి మధ్య ప్రజలకు, ముఖ్యంగా అభివృద్ధిని కోరుకునే యువతకు ప్రశాంత్ కిషోర్ ఒకే ఒక్క విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. తన జన్ సురాజ్ పాదయాత్ర ద్వారా ఏళ్ల తరబడి గ్రామగ్రామాన తిరిగి, విద్యావంతులు, ఉద్యోగ ఆశావాహులు, వ్యాపార వర్గాలతో అనుసంధానమైన తీరు ఆయనకు మైలేజ్ ఇచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను ఆర్జేడీ లేదా కాంగ్రెస్ దక్కించుకోలేకపోతున్న వేళ, పీకే ఎంచుకున్న పసుపు జెండా, విద్యా-ఉపాధి ఆధారిత రాజకీయాలు ఓటర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. పాత నేతల అవినీతి, పక్షపాత రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు పీకే సిద్ధాంతాల్లో నిజమైన మార్పును చూస్తున్నారు. లాలూ కుటుంబ వారసత్వ రాజకీయం, నితీష్ కుమార్ అవకాశవాద రాజకీయం ముగింపు దశకు చేరుకోగా, ప్రశాంత్ కిషోర్ సరికొత్త విజన్‌తో ముందుకు రావడం బీహార్‌ను 30 ఏళ్ల పాత కూపం నుంచి బయటకు తెచ్చే సంకేతంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360