Dailyhunt
బీజేపీ సింగం అన్నామలైకు టిక్కెట్ కూడా లేదు!

బీజేపీ సింగం అన్నామలైకు టిక్కెట్ కూడా లేదు!

Telugu 360 2 weeks ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో పార్టీలో అత్యంత చురుకైన నేతగా పేరున్న అన్నామలై పేరు లేదు. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు టిక్కెట్ లభించింది.

తాను ఈ సారి ఎన్నికల బరిలో నిలబడనని అన్నామలై హైకమాండ్ కు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ ఆయనను రాష్ట్రవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా, రాష్ట్రంలోని 234 స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన ప్రచారం చేయాల్సి ఉంది.

అదే సమయంలో కోయంబత్తూర్ రీజియన్‌లోని తన పట్టున్న సింగనల్లూర్ , గౌండంపాలయం వంటి నియోజకవర్గాలను పొత్తులో భాగంగా ఏఐఏడీఎంకే కేటాయించకపోవడంతో ఆయన పోటీకి విముఖత చూపినట్లు చెబుతున్నారు. కేవలం ఆరు నియోజకవర్గాలకే తనను పరిమితం చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని, అందుకే కేవలం కార్యకర్త గా ప్రచారానికే పరిమితం అవుతానని ఆయన ప్రకటించారు.

గవర్నర్ పదవికి రాజీనామా చేసి మరీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై సౌందరరాజన్‌ కు పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. ఆమెను చెన్నైలోని అత్యంత కీలకమైన మైలాపూర్ నియోజకవర్గం నుండి బరిలోకి దించింది. పార్టీ సీనియర్ నేతగా, గతంలో రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉండటం, మహిళా ఓటర్లను ఆకర్షించగల సామర్థ్యం ఆమెకు ఉండటంతో అధిష్టానం ఆమెపై నమ్మకం ఉంచింది.

ఈసారి బీజేపీ ఎన్డీయే కూటమిలో భాగంగా 27 స్థానాల్లో పోటీ చేస్తోంది. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ , వానతి శ్రీనివాసన్ వంటి ఉద్దండులను బరిలోకి దించినా, అన్నామలై లేకపోవడం పార్టీ కేడర్‌లో కొంత నిరాశను మిగిల్చింది. అన్నామలైని భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రకు లేదా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని, అందుకే ఆయనను అసెంబ్లీ బరిలో దించలేదని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360