Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్యాలెట్ తోనే  స్థానిక పోరు!

బ్యాలెట్ తోనే స్థానిక పోరు!

Telugu 360 3 weeks ago

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు స్వస్తి చెప్పి, పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లను ముమ్మరం చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున బ్యాలెట్ పేపర్ల కొనుగోలుకు సంబంధించిన చర్యలు కూడా ప్రారంభించింది.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పోల్స్‌ను ఈవీఎంల ద్వారానే నిర్వహిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బ్యాలెట్ వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు ప్రజా తీర్పును అంగీకరించకుండా ఈవీఎం ట్యాంపరింగ్ పేరుతో సాకులు వెతుక్కోవడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది. తమ తప్పులను, ఓటములను కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ పార్టీలకు ఈవీఎంలు ఒక సులువైన ఆయుధంగా ఉపయోగపడుతున్నాయి. బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇటువంటి నిందలకు, అనుమానాలకు ఆస్కారం ఉండదని, ఓటింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి సాంకేతిక సాకులు చెప్పే అవకాశం ఇవ్వకూడదనే కోణంలోనే ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈవీఎంల విశ్వసనీయతపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రశ్నలు లేవనెత్తిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేరుగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే పోలింగ్ నిర్వహించడం వల్ల, వచ్చే ఫలితం ఏదైనా అది కచ్చితంగా ప్రజల అసలైన తీర్పే అని నిరూపితమవుతుంది. దీనివల్ల ఓటమిని అంగీకరించక తప్పని పరిస్థితిని, వైసీపీ కు ఏ ఒక్క చిన్న సాకు కూడా దొరకని వాతావరణాన్ని కల్పించాలనేది కూటమి ప్రభుత్వ స్పష్టమైన ఆలోచనగా కనిపిస్తోంది.

స్థానిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియపై చురుగ్గా దృష్టి సారించింది. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో ప్రజా తీర్పును పూర్తి నిజాయితీతో లెక్కించేందుకు బ్యాలెట్ వ్యవస్థే అత్యుత్తమమని అధికారులు నిర్ణయించారు. బ్యాలెట్ పేపర్ల కొనుగోలు ప్రక్రియ కూడా వేగవంతం కావడంతో, అతిత్వరలోనే స్థానిక పోరుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360