Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైర్మన్లు, మేయర్ అభ్యర్థులుగా వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు?

చైర్మన్లు, మేయర్ అభ్యర్థులుగా వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు?

Telugu 360 1 week ago

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ల ఎంపికను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నిర్వహించాలని నిర్ణయించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

పరోక్ష ఎన్నికల్లో అధికార పక్షానికి యంత్రాంగం, క్యాంపు రాజకీయాల మద్దతు సులువుగా లభిస్తుందనే భావన ఉండేది. అయితే, ప్రజలే నేరుగా ఓటు వేసి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జెడ్పీ పీఠాలను ఎన్నుకునే విధానం అమల్లోకి వస్తే, అది తమ పార్టీకి కలసివస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే బలమైన నేతలను బరిలోకి దింపే దిశగా ఆయన ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు.

గెలుపే లక్ష్యంగా సీనియర్ నేతలు పోటీలోకి!

ప్రత్యక్ష పోరులో గెలుపే లక్ష్యంగా జగన్ ఓ కీలకమైన ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులనే నేరుగా మేయర్, జెడ్పీ చైర్మన్ బరిలో నిలబెట్టాలనేది ఆయన మాస్టర్ ప్లాన్. సీనియర్ నాయకులకు నియోజకవర్గాల్లో ముఖ పరిచయం, సొంత క్యాడర్ బలంతో పాటు ఆర్థిక స్థోమత ఉండటంతో వారు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా కొన్ని కీలకమైన స్థానాలు గెలుచుకున్నా.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే నరేటివ్‌ను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని జగన్ లెక్కిస్తున్నారు.

సీనియర్ నేతలు ముందుకు వస్తారా?

అయితే, ఈ వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడం జగన్‌కు అనుకున్నంత తేలికైన విషయం కాదు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన అనుభవం ఉన్న మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఇప్పుడు మున్సిపల్, జెడ్పీ స్థానాలకు పోటీ చేయడానికి ఎంతవరకు సిద్ధపడతారనేది ప్రధాన ప్రశ్న. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే తమ సొంత రాజకీయ భవిష్యత్తు, ఇమేజ్ దెబ్బతింటుందనే భయం చాలామంది సీనియర్లలో ఉంది. పైగా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వేళ, అధికార కూటమి నుంచి వచ్చే రాజకీయ, పారిశ్రామిక ఒత్తిళ్లను తట్టుకుని ఎంతమంది సీనియర్లు భారీ మొత్తంలో ఖర్చు పెట్టి స్థానిక పోరులో నిలబడతారనేది ప్రశ్నార్థకమే.

పోటీకి ఎదురు చూసే వారు సహకరిస్తారా?

మరోవైపు, ద్వితీయ శ్రేణి నాయకత్వం పరిస్థితి కూడా భిన్నంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో ఎదిగేందుకు ఎదురుచూస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులను పక్కనపెట్టి, మళ్లీ సీనియర్లకే పీఠాలు అప్పగిస్తే స్థానికంగా అసంతృప్తి జ్వాలలు రగిలే ప్రమాదం ఉంది. సీనియర్లు పోటీకి నిరాకరిస్తే ప్రత్యామ్నాయంగా ఎవరిని నిలబెట్టాలనే విషయంలో జగన్‌కు పెద్ద సవాలే ఎదురుకానుంది. ఏది ఏమైనా, ప్రత్యక్ష ఎన్నికల నిర్ణయం ఒకవైపు ఆశలు రేపినా, సీనియర్లను రేసులోకి తెచ్చి గెలిపించడం వైఎస్సార్‌సీపీకి అతిపెద్ద పొలిటికల్ టెస్ట్ గా మారనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360