Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంద్రబాబు జనాభా పాలసీపై ఫెమినిస్టుల విమర్శలు

చంద్రబాబు జనాభా పాలసీపై ఫెమినిస్టుల విమర్శలు

Telugu 360 6 days ago

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రతిపాదించిన పాపులేషన్ పాలసీ, ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్య్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

రాష్ట్రంలో తగ్గుతున్న జననాల రేటును అరికట్టేందుకు, భవిష్యత్తులో యువ శ్రామిక శక్తి కొరత రాకుండా ఉండేందుకు మూడో బిడ్డకు రూ.30,000, నాలుగో బిడ్డకు రూ.40,000 ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదనపై మహిళా సంఘాలు, ఫెమినిస్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళల శరీరం, ఆరోగ్యం వారి వ్యక్తిగత ఇష్టమని, ఓట్లు లేదా జనాభా లెక్కల కోసం వారిని పిల్లలను కనే యంత్రాలుగా మార్చాలని చూడటం సరికాదని వారంటున్నారు.

మాజీ హెల్త్ సెక్రటరీ పీవీ రమేష్ ఇప్పటికే ఉన్న జనాభాకు నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం, పోషకాహారం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో, కేవలం సంఖ్యాపరమైన జనాభా పెంపును ప్రోత్సహించడం వల్ల పరోక్షంగా తల్లుల, శిశువుల ఆరోగ్య భద్రత ప్రమాదంలో పడుతుందని ఆయన కోణంలో విశ్లేషించారు.

ప్రముఖ పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజనీ సంతోష్ సోషల్ మీడియా వేదికగా ఈ పాలసీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వైద్యురాలిగా, తల్లిగా నాకు చాలా ఆందోళనగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే రూ.30,000 లేదా రూ.40,000 అనే ఒకే ఒక్కసారి సాయం కొద్ది రోజుల్లోనే ఖర్చయిపోతుంది. ఆ తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు, వారి పోషకాహారం, చదువు, నివాస వసతి ఖర్చులను ఆ కుటుంబాలు ఎలా భరించగలవు అని ఆమె ప్రశ్నించారు. కేవలం నగదు ఆశ చూపి పేద కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చేలా ప్రోత్సహించడం దీర్ఘకాలంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆమె స్పష్టం చేశారు.

పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సినీ నటి పూనమ్ కౌర్ వంటి వారు ఈ వ్యవహారంపై వ్యతిరేకంగా స్పందించారు. ఈ అంశంపై కొంత మంది తగ్గిపోతున్న జనాభా అంశం ఆధారంగా సమర్థిస్తున్నారు. ఎవర్నీ ప్రభుత్వం పిల్లల్ని కనాలని బలవంతం చేయడం లేదని.. రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ ఓ పాలసీని వర్కవుట్ చేస్తోందని అంటున్నారు. మొత్తంగా చంద్రబాబు లేవనెత్తిన అంశంపై అదే పనిగా సోషల్ మీడియా చర్చిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360