Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంద్రబాబు రాజకీయంలో హ్యూమన్ టచ్ !

చంద్రబాబు రాజకీయంలో హ్యూమన్ టచ్ !

Telugu 360 4 days ago

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాణక్యుడిగా , హైటెక్ ముఖ్యమంత్రిగా ముద్రపడ్డ నారా చంద్రబాబు నాయుడు.. తన నాలుగో విడత పాలనలో సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన సామాన్యులతో మమేకమవుతున్న తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు నాయుడు అంటే ఒకప్పుడు విజన్ 2020, కంప్యూటర్లు, విదేశీ పెట్టుబడులు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఒకప్పుడు సెక్యూరిటీ వలయం దాటి సామాన్యుడు ఆయనను కలవడం కష్టమనే పేరు ఉండేది. అయితే, తాజా పదవీ బాధ్యతలు చేపట్టాక ఆయన తన శైలిని పూర్తిగా మార్చుకున్నారు. గతంలో చెప్పులు కుట్టే వ్యక్తి ఇంటికి వెళ్లడం, ఆటో డ్రైవర్ కుటుంబంతో ముచ్చటించడం, తాజాగా ఒక మత్స్యకారుని ఇంటికి వెళ్లి వారితో కలిసి నేలపై కూర్చుని చేపల కూరతో భోజనం చేయడం.. ఇవన్నీ చంద్రబాబులో వచ్చిన సాఫ్ట్ పవర్ మార్పునకు నిదర్శనం.

నచ్చని వారికి పబ్లిసిటీ స్టంటే

రాజకీయాల్లో ప్రతి చిన్న పనికీ ఒక అర్థం ఉంటుంది. చంద్రబాబు చేస్తున్న ఈ పర్యటనలను ప్రతిపక్షాలు పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నాయి. అయితే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా మీడియా వెంటే ఉంటుంది, ప్రచారం అనేది అనివార్యం. దాన్ని సీక్రెట్ గా చేయడం భద్రతా పరంగా, ప్రోటోకాల్ పరంగా సాధ్యం కాని పని. కేవలం కెమెరాల కోసం చేసే పని అయితే అది ఒక్కసారికి పరిమితం అవుతుంది, కానీ వరుసగా ఇలా సామాన్యుల ఇళ్లకు వెళ్లడం వెనుక ఓటర్ల నాడిని నేరుగా పట్టుకోవాలనే బలమైన సంకల్పం కనిపిస్తోంది. పైస్థాయి అధికారుల రిపోర్టుల కంటే, క్షేత్రస్థాయిలో పేదవాడి కంచంలో ఏం ఉందో తెలుసుకోవడమే పాలనా దక్షతకు అసలైన పరీక్ష అని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

పాలనలో హ్యూమన్ టచ్

నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు అధికార వ్యతిరేకత ఎలా వస్తుందో ఓ అంచనాకు వచ్చారు. దాన్ని అధిగమించడానికి చంద్రబాబు హ్యూమన్ టచ్ అనే అస్త్రాన్ని వాడుతున్నారు. తాను కేవలం సచివాలయానికి పరిమితమైన నాయకుడిని కాదని, సామాన్య మత్స్యకారుడి కష్టాల్లోనూ పాలుపంచుకునే పెద్ద దిక్కు నని ఆయన నిరూపించుకుంటున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అనే ఫీడ్‌బ్యాక్ ఆయనకు తక్షణమే అందుతోంది.

మారిన బాబు.. మారుతున్న రాజకీయం

చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు కేవలం ఎన్నికల వ్యూహం మాత్రమే కాదు, ఇది ఒక పరిణతి చెందిన నాయకుడి ప్రవర్తనగా భావిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవ్వడం వల్ల పాలనలో పారదర్శకత పెరుగుతుంది. అధికారులు కూడా ముఖ్యమంత్రి ఎప్పుడైనా, ఎవరి ఇంటికైనా వెళ్లవచ్చు అనే హెచ్చరికతో అప్రమత్తంగా ఉంటున్నారు. విమర్శకులు ఏమైనా అనుకున్నా, ఒక సామాన్యుడి ఇంట్లో ముఖ్యమంత్రి భోజనం చేయడం అనేది ఆ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. రాజకీయాలకు అతీతంగా చూస్తే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుడు - ప్రజల మధ్య ఉండాల్సిన దూరాన్ని తగ్గించే ఒక సానుకూల పరిణామం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360