ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో ఎవరూ ఊహించని ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన గూటికి చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హఠాత్తుగా అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు.
నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం రాజకీయంగా కాస్త గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, దగ్గరి బంధువు వడంతో.. ఆయన జనసేనలో చేరినప్పటికీ కూటమిలోని క్షేత్రస్థాయి కేడర్ అంత సులభంగా ఆయనను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు, ఒంగోలు జనసేన పార్టీలో స్థానిక పాత నాయకత్వానికి, బాలినేని వర్గానికి మధ్య తీవ్రమైన అంతర్గత విభేదాలు, వర్గపోరు నడుస్తోంది. అదే సమయంలో టీడీపీ నేత, ఎమ్మెల్యేల దామచర్ల జనార్ధన్ తో అసలు పొసగదు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీపై, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు గుప్పించారు. వైసీపీ తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు మినహా ఎవరూ మిగలరు అంటూ గతంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే టీడీపీ అధినేతను కలిసి సానుకూల వాతావరణంలో చర్చలు జరపడం రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవనే సూత్రాన్ని మరోసారి నిరూపించింది.
ఈ భేటీ వెనుక ఒక పెద్ద సీట్ల సర్దుబాటు వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు. రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య ఉన్న గందరగోళానికి చెక్ పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో ఆయన ఒంగోలు రాజకీయాల్లో వేలు పెట్టకుండా.. వేరే నియోజకవర్గం గురించి చర్చించారని చెబుతున్నారు. పునర్విభజన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి…. బాలినేని కూడా సంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు.

