వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే పదే చికిత్స కోసం అమెరికా పయనం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
భారత వైద్య రంగం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, విదేశాల నుంచి కూడా ఎందరో రోగులు ఇక్కడి అత్యున్నత వైద్య సేవల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు క్యూ కడుతున్న తరుణంలో.. చెవిరెడ్డి మాత్రం కేవలం యుఎస్ ఎస్‌లోనే చికిత్స తీసుకుంటాను అని పట్టుబట్టడం ఆసక్తికరంగా మారింది. అమెరికాలో వైద్య ఖర్చులు అత్యంత భారమనే విషయం తెలిసినా, ఆయన పదే పదే కోర్టు అనుమతులు తెచ్చుకుని మరీ అక్కడికే వెళ్లడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మద్యం పాలసీ వ్యవహారం సహా వివిధ కేసులలో విచారణ ఎదుర్కొంటున్న చెవిరెడ్డి షరతుల బెయిల్ మీద ఉన్నారు. దీంతో ఏసీబీ కోర్టును ఆశ్రయించి విదేశీ ప్రయాణానికి అనుమతి పొందుతున్నారు. రూ. 3 లక్షల భద్రతా డిపాజిట్లు, బాండ్లు సమర్పించి మరీ జూలై చివరలో అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన ఆయన, మళ్లీ అదే కారణంతో విదేశాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. సాధారణంగా కేసుల విచారణ తీవ్ర స్థాయిలో ఉన్న వేళ నాయకులు దేశం దాటడం వెనుక కేవలం హెల్త్ చెకప్‌లు మాత్రమే ఉంటాయా లేదా రాజకీయ లోపాయికారీ వ్యూహాలు ఉంటాయా అనే కోణంలో విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.
ఎన్‌ఆర్ఐలు సైతం అత్యవసర చికిత్సలు, ఇన్సూరెన్స్ సమస్యల దృష్ట్యా స్వదేశానికే వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి నేడు ఉంది. అలాంటిది చెవిరెడ్డికి దేశంలోని ఏ కార్పొరేట్ హాస్పిటల్ సేవలు నచ్చకపోవడం లేదా ఇక్కడి వైద్యులపై నమ్మకం లేకపోవడం ఆశ్చర్య కలిగిస్తోంది. ఒకవేళ నిజంగానే అంత తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటే దానికి సంబంధించిన వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదన్న ప్రశ్న వస్తోంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఐదేళ్ల అక్రమాలపై, విచారణ ఎదుర్కొంటున్న వైఎస్సార్‌సీపీ నేతలకు చట్టపరమైన చిక్కులు చుట్టుముడుతున్న వేళ.. చెవిరెడ్డి అమెరికా పర్యటనలు కేవలం వైద్యం కోసమేనా? లేక విదేశాల్లో ఉన్న తన ఆస్తులు, వ్యాపార లావాదేవీలను సర్దుబాటు చేసుకోవడానికి , చట్టపరమైన చర్యల నుంచి తాత్కాలిక ఊరట పొందడానికి వేస్తున్న రాజకీయ వ్యూహమా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.

