దాసరి నారాయణరావు సమాధి సంరక్షణ విషయంలో మంచు సోదరులు మనోజ్, విష్ణుల మధ్య ఆసక్తికరమైన పోటీ కనిపించింది. మొయినాబాద్‌లోని దాసరి సమాధి సంరక్షణ లేక పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో పాడుపడి ఉందంటూ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో టాలీవుడ్ ఒక్కసారిగా అలర్ట్ అయింది.
ఈ దృశ్యాలపై స్పందించిన కొందరు సినీ ప్రముఖులు, తాము ఇప్పటి నుంచి దాసరి ఘాట్‌ను మరింత జాగ్రత్తగా చూసుకుంటామని, రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ సేవా కార్యక్రమాల్లో మంచు మనోజ్, మంచు విష్ణు టీమ్‌ల మధ్య జరిగిన పోటీ మాత్రం అందరినీ విశేషంగా ఆకర్షించింది.
దాసరి సమాధి దుస్థితిపై వీడియో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే హీరో మంచు మనోజ్ రంగంలోకి దిగారు. శనివారం ఉదయమే 7 గంటల కల్లా తన ఐక్య ధైర్య సేనా సమితి బృందంతో కలిసి ఆయన నేరుగా మొయినాబాద్‌లోని ఘాట్ వద్దకు చేరుకున్నారు. సమాధి పరిసరాల్లో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, ఆ ప్రాంతాన్ని స్వయంగా శుభ్రం చేయించారు. అనంతరం దాసరి దంపతుల సమాధికి నివాళులర్పించిన మనోజ్.. ఆ తర్వాతే తన సినిమా షూటింగ్‌కు వెళ్లారు.
మధ్యాహ్నం సమయానికి మా అధ్యక్షుడు మంచు విష్ణు టీమ్ పేరుతో మరికొంత మంది ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. ఉదయమే మనోజ్ బృందం క్లీన్ చేసిన ఆ ప్రదేశాన్ని విష్ణు టీమ్ సభ్యులు మరింతగా శుభ్రపరిచి, సమాధులను పూలదండలతో అలంకరించి వెళ్లారు. ప్రస్తుతం మంచు విష్ణు నగరంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన నేరుగా రాలేకపోయినప్పటికీ.. తన టీమ్‌ను పంపి ఈ సంరక్షణ ప్రక్రియలో భాగస్వాములను చేశారు.
ఈ పరిణామాల దాసరి ఘాట్ వద్ద మంచు సోదరుల సేవా పోటీపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మంచు విష్ణు నగరంలో లేకపోవడం వల్ల నేరుగా రాలేకపోగా.. మనోజ్ మాత్రం ఇక్కడే అందుబాటులో ఉండటంతో ఉదయమే స్వయంగా వచ్చి క్లీనింగ్ పనులు పర్యవేక్షించారు. దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిని చూసి చలించి, తక్షణమే స్పందించి నేరుగా రంగంలోకి దిగడం ద్వారా ఈ సేవా పోటీలో మంచు మనోజ్ స్పష్టమైన అడ్వాంటేజ్ సాధించినట్లయింది.

