Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దక్షిణ తెలంగాణలో బలపడితేనే బీజేపీ, బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ !

దక్షిణ తెలంగాణలో బలపడితేనే బీజేపీ, బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ !

Telugu 360 4 days ago

తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు అందరి కళ్లూ దక్షిణ తెలంగాణపైనే పడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోటగా మారింది.

గత అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్నమొన్నటి లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఈ బెల్ట్ హస్తం పార్టీకి కొండంత అండగా నిలుస్తూ వస్తోంది. అయితే, ఈ బలమైన కోటను బద్దలు కొట్టడమే ఏకైక లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

దక్షిణ తెలంగాణలో బీజేపీ మరింత బలహీనం

భౌగోళికంగా చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఒక స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకుంటూ, దూకుడుగా విస్తరిస్తోంది. అయితే, దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. ఈ బలహీనతను అధిగమించేందుకు కమలం పార్టీ ఇప్పుడు ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం పట్టు సాధించేందుకు హిందుత్వ కార్డ్ ను అస్త్రంగా మలచుకుంటోంది. స్థానిక ఉత్సవాలు, ఆలయాల చుట్టూ కార్యక్రమాలను రూపొందిస్తూ, సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తరాది ఫార్ములాను ఇక్కడి సామాజిక సమీకరణాలకు ముడిపెడుతూ కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్లకు గండి కొట్టాలని చూస్తోంది.

పట్టు కోల్పోయిన బీఆర్ఎస్ - మళ్లీ పుంజుకోగలదా?

మరోవైపు, గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయిన బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు తనదైన శైలిలో పోరాడుతోంది. బీజేపీ లాగా మతపరమైన సమీకరణాలు కాకుండా, పక్కా క్షేత్రస్థాయి సెంటిమెంట్‌ను, ప్రాంతీయ ఆకాంక్షలను గులాబీ దళం నమ్ముకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో లోపాలు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా లేవనెత్తుతోంది. స్థానిక నిరుద్యోగులు, రైతాంగ సమస్యలపై ఉద్యమిస్తూ.. తెలంగాణ హక్కుల రక్షకుడు బీఆర్ఎస్ మాత్రమేననే సెంటిమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు గులాబీ బాసులు చెమటోడుస్తున్నారు. అయితే సెంటిమెంట్ ఎంత మేర వర్కవుట్ అవుతుందన్నది సందేహంగాేన ఉంది.

అధికారం కావాలంటే దక్షిణ తెలంగాణనే సాధ్యం

దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ను ఒంటరిగా ఢీకొట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చనే అంచనాతో.. క్షేత్రస్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య అధికారికంగా కాకపోయినా, అనధికారికంగా శత్రువుకు శత్రువు మిత్రుడు అనే ఫార్ములా అమలయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దక్షిణ తెలంగాణ వేదికగా సాగుతున్న ఈ ఓటు బ్యాంక్ వార్ రాబోయే రోజుల్లో మరింత ఊపందుకోనుంది. కాంగ్రెస్ తన కంచుకోటను కాపాడుకునేందుకు సంక్షేమ పథకాలు, అధికార బలాన్ని నమ్ముకోగా.. దానిపై సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్‌లు సిద్ధమయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360