ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేషన్ నూతన ఛైర్మన్‌గా సీనియర్ నిర్మాత పి.
భరత్ భూషణ్ ను నియమించగా, వైస్ ఛైర్మన్‌గా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరితో పాటు పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన మరో 14 మంది ప్రముఖులను డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
కార్పొరేషన్ రథసారధిగా పగ్గాలు చేపట్టిన పి. భరత్ భూషణ్ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా సుపరిచితులు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ , ఎగ్జిబిటర్‌గా ఆయనకు బలమైన గుర్తింపు ఉంది. గాయత్రి దేవి ఫిల్మ్స్ బ్యానర్‌పై పలు చిత్రాల పంపిణీదారుడిగా వ్యవహరించిన ఆయన, పరిశ్రమ ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలు, థియేటర్ల యాజమాన్యాల ఇబ్బందులపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగంలో చురుగ్గా పనిచేస్తూ, కూటమి విజయం కోసం శ్రమించిన భరత్ భూషణ్ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పదవిని కట్టబెట్టారు.
వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు దక్కించుకున్న దర్శకుడు మెహర్ రమేష్ నియామకం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. మెహర్ రమేష్‌కు చిత్ర పరిశ్రమలోని అగ్రనాయకత్వంతో అత్యంత ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా నారా, నందమూరి, మెగా కుటుంబాలకు ఆయన అత్యంత సన్నిహితుడు. కేవలం సినీ మేకింగ్‌లోనే కాకుండా, పరిశ్రమకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వంతో పరిశ్రమకు ఉండాల్సిన సమన్వయంపై ఆయనకున్న పట్టును దృష్టిలో ఉంచుకునే కూటమి ప్రభుత్వం ఆయనకు ఈ కీలక బాధ్యతను అప్పగించింది.
భరత్ భూషణ్ - మెహర్ రమేష్ ద్వయం నేతృత్వంలోని నూతన బోర్డు ఏపీలో చలనచిత్ర పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది. విశాఖపట్నాన్ని సినిమా హబ్‌గా తీర్చిదిద్దడం, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా షూటింగ్‌లకు అనుమతులు సులభతరం చేయడం, థియేటర్ల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు.. మూలనపడిన నాటకరంగానికి, టెలివిజన్ రంగానికి నిధులు కేటాయించి కొత్త ప్రోత్సాహకాలు అందించడమే లక్ష్యంగా ఈ 16 మంది సభ్యుల కమిటీ పనిచేయనుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

