తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఏసీబీ మరో భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీస్ శాఖకు చెందిన కీలక అధికారి, డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసాలు, ఆఫీసులపై ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచే ఏకకాలంలో మెగా సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ఆయనకు సంబంధించిన మొత్తం 12 ప్రాంతాల్లో ఈ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటివరకు బయటపడిన ఆస్తుల విలువ మార్కెట్ ధరల ప్రకారం అక్షరాలా వంద కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఏసీబీ జరిపిన ఈ మెగా రైడ్స్‌లో లభించిన డాక్యుమెంట్లు చూసి స్వయంగా అధికారులే విస్తుపోతున్నారు. మణికొండలోని పుప్పాలగూడలో ఉన్న ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలోనే డీఎస్పీ భీమ్‌రెడ్డికి చెందిన మూడు ఖరీదైన ఫ్లాట్లను అధికారులు గుర్తించారు. ఒక్కో ఇల్లు ఎనిమిది కోట్లు ఉంటుందని అంచనా. వీటితో పాటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ ఆయన భారీగా భూములు కొనుగోలు చేసినట్లు పత్రాలు లభ్యమయ్యాయి. బెంగళూరు నగర పరిధిలో ఒక ఎకరా భూమి, కర్ణాటకలోని మరో ప్రాంతంలో 3 ఎకరాల భూమితో పాటు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో 6 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కేవలం స్థిరాస్తులే కాకుండా భీమ్‌రెడ్డి నివాసంలో భారీగా లగ్జరీ వస్తువులు, కరెన్సీ పట్టుబడినట్లు తెలుస్తోంది. సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో కుప్పలుగా పడి ఉన్న భారీ బంగారు ఆభరణాలను, వెండి వస్తువులను ఏసీబీ సీజ్ చేసింది. ఇవన్నీ ఒకెత్తయితే.. ఆయన ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన భారీ ఎత్తున విదేశీ మద్యం సీసాలను చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు దొరకడం కలకలం రేపుతోంది. దీనిపై ఎక్సైజ్ శాఖకు కూడా సమాచారం అందించినట్లు సమాచారం.
డీఎస్పీ భీమ్‌రెడ్డి గతంలో పటాన్‌చెరు పరిధిలో పనిచేసిన కాలంలోనే ఈ అక్రమార్జనకు తెరలేపినట్లు గట్టి ఆరోపణలు వినవస్తున్నాయి. అప్పట్లో పటాన్‌చెరు స్థానిక శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డితో చేతులు కలిపి.. భూవివాదాలు, పారిశ్రామిక సెటిల్‌మెంట్లు, సివిల్ పంచాయితీల్లో జోక్యం చేసుకుని పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఏసీబీ ఇంటెలిజెన్స్ నివేదికల్లో తేలింది. రాజకీయ అండదండలతో సాగించిన ఈ ల్యాండ్ సెటిల్‌మెంట్ల వల్లే ఆయన ఇంత తక్కువ కాలంలో వందల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

