ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసింది. అయితే ఏడాది తర్వాత వైసీపీ వారి కష్టాన్ని కించపరుస్తూ తప్పుడు ..
ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోంది. దేశవ్యాప్త నీట్ పేపర్ లీక్ ఉదంతాన్ని సాకుగా చూపి, అదే తరహాలో ఏపీ డీఎస్సీలో కూడా అక్రమాలు జరిగాయని నమ్మించేందుకు కుట్ర పూరిత రాజకీయం చేస్తున్నారు.
ఉద్యోగాల భర్తీపై బురద చల్లే ప్రయత్నం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై మొదటి సంతకం చేసి, నిరుద్యోగుల దశాబ్దాల కలను నిజం చేశారు. ఐదేళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా కాలక్షేపం చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు అత్యంత పారదర్శకతతో జరిగిన ప్రక్రియపై నిందలేస్తున్నారు. అసలు డీఎస్సీ జరగకుండా వందల సంఖ్యలో పిటిషన్లు వేశారు. అన్నింటిని దాటుకుని రిక్రూట్మెంట్ పూర్తి చేశారు. అయినా వారిని వదలడంలేదు. సిబిఐ విచారణ జరిపించాలని కోరడం కేవలం నిరుద్యోగులను అయోమయంలోకి నెట్టే రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని స్పష్టమవుతోంది.
16 వేల మంది కష్టాన్ని తక్కువ చేయడమే
నిద్రాహారాలు మాని, ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టి అత్యంత కఠినమైన పోటీలో నెగ్గి ఉద్యోగాలు సాధించిన 16,347 మంది అభ్యర్థుల కష్టాన్ని వైసీపీ నేతలు తమ ఫేక్ ప్రచారాలతో అవమానిస్తున్నారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వారు, అందులో ఒక్క శాతం నిజం ఉన్నా కోర్టును ఆశ్రయించకుండా కేవలం వీధి నాటకాలు ఆడటం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీచర్లుగా బాధ్యతలు చేపట్టి, పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న వారి మనోభావాలను దెబ్బతీస్తూ, వారి భవితవ్యాన్ని రాజకీయ రచ్చలోకి లాగడం అత్యంత దుర్మార్గమైన చర్య.
కోర్టుకు వెళ్లలేరు.. కానీ అబద్ధాలు ప్రచారం చేస్తారు
వైసీపీ ఆరోపణల్లో పస లేదని చెప్పడానికి బలమైన నిదర్శనం ఏమిటంటే, ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఆధారంతో కూడా వారు చట్టపరమైన పోరాటం చేయలేదు. కేవలం సామాజిక మాధ్యమాల్లో బాట్స్ , ఫేక్ ఐడీల ద్వారా ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పరీక్షలు ముగిసి, ఫలితాలు వచ్చి, నియామక ప్రక్రియ ముగిసిన ఏడాది తర్వాత ఇప్పుడు లీక్ పురాణం ఎత్తుకోవడం వెనుక కేవలం రాజకీయ మనుగడ ఆరాటమే తప్ప, అభ్యర్థుల పట్ల ప్రేమ లేదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యువత భవిష్యత్తుతో చెలగాటం
నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం చేతగాని వారు, కనీసం వస్తున్న ఉద్యోగాలనైనా అడ్డుకోకుండా ఉంటే మంచిదని నిరుద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వంలో టీచర్ పోస్టుల ఊసే లేక, వేల మంది వయసు పైబడి అనర్హులుగా మారినప్పుడు నోరు విప్పని నేతలు, ఇప్పుడు యువతకు దక్కుతున్న గౌరవప్రదమైన ఉపాధిని అపహాస్యం చేస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన ప్రచారాలు చేస్తున్న వారికి ప్రజల కష్టం కంటే రాజకీయ పబ్బం గడుపుకోవడమే ముఖ్యమని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.

