దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో పాటు మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుపై జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సాధారణ మెజార్టీ లభించినప్పటికీ, ఉభయ సభల్లో అవసరమైన మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజార్టీ లభించకపోవడంతో సాంకేతికంగా అది వీగిపోయింది.
వచ్చే నెలలో ఏకాభిప్రాయం ద్వారా రాజ్యాంగసవరణ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సారి బిల్లులో యాభై శాతం స్థానాల పెంపు
గతంలో లోక్‌సభ స్థానాలను యాభై శాతం మేర పెంచుతామనే ప్రతిపాదన కేవలం నోటి మాటగా లేదా హామీగా మాత్రమే ఉండగా.. ఈసారి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దానికి చట్టబద్ధమైన గ్యారెంటీని కల్పిస్తూ, పక్కాగా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల గరిష్ట సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి దాదాపు 850 స్థానాలకు పెంచాలని ప్రతిపాదించారు. అన్ని రాష్ట్రాలకూ సమానంగా 50 శాతం మేర సీట్లను పెంచడం ద్వారా ఏ ఒక్క రాష్ట్రానికీ నష్టం జరగకుండా బ్యాలెన్స్ చేయవచ్చని, అదే సమయంలో పాత నియోజకవర్గాల సరిహద్దులు మార్చకుండానే 33 శాతం మహిళా రిజర్వేషన్లను 2029 ఎన్నికల నాటికే వర్తింపజేయవచ్చని కేంద్రం భావిస్తోంది.
ఏకాభిప్రాయసాధన విషయంలో చంద్రబాబుకు బాధ్యతలు
ఈ బిల్లుపై జాతీయ స్థాయిలో, ముఖ్యంగా దక్షిణాది పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించే కీలకమైన బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్డీయే కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడుకు అప్పగించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఆయన చెన్నై వేదికగా జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశంపై డీఎంకే, కాంగ్రెస్ వంటి విపక్షాల వైఖరిని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకూ దామాషా పద్ధతిలో సీట్లు పెరిగినప్పుడు ప్రాంతీయ వివక్షకు తావెక్కడిదని ఆయన గట్టిగా సమర్థించారు. చంద్రబాబుకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో ఉన్న సఖ్యత దృష్ట్యా.. ఈ వివాదానికి చట్టపరమైన రక్షణలతో కూడిన పరిష్కారాన్ని చూపే బాధ్యతను ఢిల్లీ పెద్దలు ఆయన భుజాలపై పెట్టినట్లు తెలుస్తోంది.
వచ్చేనెలలోనే మళ్లీ లోక్ సభ ప్రత్యేక సమావేశాలు
వచ్చే నెలలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ సవరించిన బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. చంద్రబాబు దౌత్యం ఫలించి, విపక్షాలు లేవనెత్తిన ఫెడరల్ స్ఫూర్తి ఆందోళనలకు బిల్లులోనే చట్టబద్ధమైన క్లాజుల ద్వారా రక్షణ కల్పిస్తే.. వచ్చే నెలలోనే మహిళా బిల్లుతో ముడిపడిన ఈ చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ ఉభయ సభల ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే గనుక జరిగితే, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా సరికొత్త రాజకీయ పటం ఆవిష్కృతం కావడంతో పాటు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఒక వాస్తవరూపం దాల్చనుంది.

