Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దినేష్ కమిటీ రిపోర్ట్:  ప్రభుత్వం ఏం చేయబోతోంది?

దినేష్ కమిటీ రిపోర్ట్: ప్రభుత్వం ఏం చేయబోతోంది?

Telugu 360 3 weeks ago

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోంది. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ చార్జిషీటు ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను, పాలనాపరమైన లోపాలను విచారించడానికి ప్రభుత్వం నియమించిన దినేష్ కుమార్ ఏకసభ్య కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

ఈ నివేదికలోని అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

నివేదికలో ఏముంది ?

దినేష్ కుమార్ కమిటీ నివేదిక కేవలం నెయ్యి కల్తీకే పరిమితం కాకుండా, టీటీడీలో గత ఐదేళ్లలో జరిగిన టెండర్ల ప్రక్రియ, కొనుగోళ్లు, మరియు నిబంధనల ఉల్లంఘనపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నెయ్యి సేకరణలో రివర్స్ టెండరింగ్ పేరుతో తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థలకు కట్టబెట్టడం, నాణ్యత పరీక్షల్లో విఫలమైనా వెనకేసుకురావడం వంటి అంశాలను కమిటీ ఎత్తిచూపినట్లు సమాచారం. తిరుమలలో జరిగిన ఈ పాపాలను సాక్ష్యాధారాలతో సహా ఈ నివేదిక బయటపెట్టినట్లుగా తెలుస్తోంది.

కేసులు , బాధ్యులపై చర్యలు

ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా చాలా కఠినంగా ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం, కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్ట్ సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, గత బోర్డులోని కీలక వ్యక్తులు, నిర్ణయాధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు తుంగలో తొక్కినట్లు తేలితే, ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసే అవకాశం లేకపోలేదు.

ప్రభుత్వ అధికారుల పరిస్థితి

కేవలం రాజకీయ నేతలే కాకుండా, ఆనాడు టీటీడీలో కీలక పదవుల్లో ఉండి, నాణ్యతను పర్యవేక్షించడంలో విఫలమైన అధికారుల పైన కూడా వేటు పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేశాం అని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేసినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కింద వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా కొంతమంది ఉన్నతాధికారులకు మెమోలు జారీ చేయడం లేదా వారిని విచారణ ఎదుర్కోవాలని ఆదేశించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ కూడా జరుగుతున్నందున, దినేష్ కుమార్ కమిటీ నివేదికను ప్రభుత్వం కోర్టుకు కూడా సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా సంస్కరణలు కూడా చేపట్టనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360