ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 'డ్రాగన్' నుంచి ఓ సర్‌ప్రైజ్ వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అనుకొన్నట్టుగానే గ్లింప్స్ ఒకటి విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.
అయితే ఆ గ్లింప్స్ నిడివి నాలుగున్నర నిమిషాలనగానే పెద్ద షాక్. ట్రైలర్లే మూడు నిమిషాలకు మించడం లేదు. అలాంటిది అంత పెద్ద గ్లింప్స్ లో ఏం చూపించబోతున్నాడు? అనే ఆసక్తి రేగింది. యానిమేషన్లు, టైటిల్ కార్డ్స్ తో బోర్ కొట్టిస్తాడేమో అని కూడా అనుకొన్నారు. కానీ.. ప్రశాంత్ నీల్ మ్యాజిక్ చేశాడు. నాలుగున్నర నిమిషాల్లో ప్రతీ సెకనూ.. కళ్లప్పగించేలా, చెవులు రిక్కరించి ప్రతీ శబ్దం ఆస్వాదించేలా గ్లింప్స్ కట్ చేశాడు.
250 ఏళ్ల పరాయి పాలన వెనుక అసక్తిగల కొత్త కారణాన్నీ, కోణాన్నీ తన పరిచయ వాక్యాల్లో వెలికి తీశాడు. గోల్డెన్ ట్రయాంగిల్ గురించి అర్థమయ్యేలా చెప్పాడు. 'డ్రాగన్' నేపథ్యం ఏమిటి, ఎలాంటి క్యారెక్టర్లు ఉండబోతున్నాయి, ఎన్టీఆర్ పాత్ర తీరు తెన్నులేంటి.. ఇలా ప్రతీదీ పూస గుచ్చాడు.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో డైలాగులు, హీరో ఎలివేషన్లూ మామూలుగా ఉండవు. కేజీఎఫ్, సలార్ సినిమాల్లో హీరోని ఎలివేట్ చేసిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ గ్లింప్స్‌లోనూ కావల్సినన్ని పడ్డాయి. ఎన్టీఆర్ రాక ఆలస్యమైనా కావాల్సిన గ్రౌండ్ ని ప్రిపేర్ చేశాడు ప్రశాంత్ నీల్.
"దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం"
"నిద్రపోయేటప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ల మొహాలు రావు. మిగిలివున్న శత్రువుల మొహాలే కనిపిస్తాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు"
ఈ డైలాగులే ఎన్టీఆర్ పాత్రని ఆకాశమంత ఎలివేట్ చేశాయి.

