Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'దృశ్యం 3' రివ్యూ:  క్లైమాక్స్ ఒక్కటే కాపాడాలి

'దృశ్యం 3' రివ్యూ: క్లైమాక్స్ ఒక్కటే కాపాడాలి

Telugu 360 3 days ago

'దృశ్యం' ఫ్రాంచైజీకి కల్ట్ ఫ్యాన్ బేస్ వుంది. థ్రిల్లర్ ఎలా తీయాలి, ఎలా తీయొచ్చు… అని చెప్పడానికి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ప్రతీ సామాన్యుడులోనూ ఓ హీరో ఉంటాడు.

ప్రతీ తండ్రీ.. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అని చెప్పిన స్క్రిప్టు ఇది. సామాన్య జనానికి చాలా ఈజీగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఏ భాషలో తీసినా సూపర్ హిట్ కొట్టింది. 'దృశ్యం 2' కూడా అంచనాల్ని అందుకోగలిగింది. ఒకే కేసు చుట్టూ ఈ రెండు సినిమాలూ తిరిగినా ఎక్కడా గ్రిప్ తప్పలేదు. ఇప్పుడు దృశ్యం 3 వచ్చింది. ఈసారీ అదే కేసు. దాని చుట్టూనే ఇన్వెస్టిగేషన్. మరి దృశ్యం 1, 2లలో ఉన్న సస్పెన్స్‌, థ్రిల్లింగ్ మూమెంట్స్‌… 3వ భాగంలోనూ ఉన్నాయా? ఈ కేసుకి ఈసారైనా ముగింపు పలికారా..?

జార్జ్ (మోహన్ లాల్‌) పాత విషయాలన్నీ తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవితం గడిపేస్తుంటాడు. తన జీవితానుభవాలతో ఓ సినిమా కూడా తీస్తాడు. అది సూపర్ హిట్ అవుతుంది. కూతురు అంజు (అన్సిబా హాసన్‌)కు పెళ్లి చేయాలనుకొంటాడు. అయితే కుదిరిన ప్రతీ సంబంధం వెనక్కి వెళ్లిపోతుంటుంది. తన గురించి ఎవరో తప్పుగా ప్రచారం చేసి, సంబంధాల్ని చెడగొడుతుంటారు. ఆ అవసరం ఎవరికి వచ్చిందన్న వేదన… జార్జ్ ని కుదురుగా ఉండనివ్వదు. అంతే కాదు… తనని, తన కుటుంబాన్నీ ఎవరో ఫాలో అవుతున్నారనిపిస్తుంది. అర్థరాత్రి పూట.. తన తోటలోకి ఎవరో వచ్చి వెళ్తున్నట్టు అనుమానాలు మొదలవుతాయి. అంతేకాదు.. ముగిసిపోయిందనుకొన్న కేసు మళ్లీ ఎవరో తిరగతోడుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ తన అనుమానాలేనా, లేదంటే నిజంగానే.. ఎవరైనా తనని ఫాలో అవుతున్నారా, ఆరేళ్ల క్రితం దాచి పెట్టిన రహస్యాల్ని తవ్వుతున్నది ఎవరు? తన కుటుంబానికి ఆపద వస్తే.. జార్జ్ ఈసారి ఏం చేశాడు? అనేదే 'దృశ్యం 3' కథ.

'దృశ్యం' గుర్తుండే ఉంటుంది. ఓ హత్య కేసు తన కుటుంబంపై పడకుండా అడ్డుపడిపోతాడు హీరో. అందుకు ఆ హీరో చేసిన ప్రయత్నాలు, సాహసాలు అబ్బురపరుస్తాయి. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియర్స్ ఇచ్చిన ఫ్యామిలీ డ్రామా. దర్శకుడు జీతూ జోసెఫ్ సక్సెస్ అయ్యింది ఇక్కడే. ఓ థ్రిల్లర్‌ని ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో చెప్పడం నచ్చింది. పార్ట్ 2 కూడా అంతే. ముగిసిపోయిందనుకొన్న కేసు మళ్లీ విచారణకు వస్తుంది. ఈసారి కూడా జార్జ్ తన కుటుంబానికి అండగా నిలుస్తాడు. ఇప్పుడు పార్ట్ 3 వంతు. ఈసారీ కథ మారలేదు. కేసూ మారలేదు. అదే కేసు.. మళ్లీ విచారణకు వస్తుందేమో, తన కుటుంబం జైలు పాలు అవుతుందేమో అని భయపడ్డ ఓ తండ్రి.. ఈసారి ఎలా రక్షకుడిగా మారాడు అనేదే కథ.

పార్ట్ 1, 2, 3 సేమ్ కథ, సేమ్ డ్రామా. అయితే పార్ట్ 3లో మునుపటి భాగాలతో పోలిస్తే సస్పెన్స్‌, థ్రిల్ మిస్సయ్యాయి. ఫస్టాఫ్ మరీ… నిదానంగా సాగుతుంటుంది. అక్కడక్కడ ఇన్వెస్టిగేషన్ మూడ్ వస్తుంది. తన కూతురికి పెళ్లి సంబంధాలు చూడడం, అవి తప్పిపోవడం, జార్జ్ మదనపడడం, అందుకు గల కారణాలు తెలుసుకోవడంతో… ఇంట్రవెల్ కార్డ్ పడుతుంది. ఇంట్రవెల్ కి ముందు ఓ కొత్త పాత్ర ప్రవేశించి, కథలో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తి స్థాయిలో ఫలితాన్ని అందివ్వలేదు. జర్నలిస్టు కోణంలో ఇన్వెస్టిగేషన్ జరపడం మంచి ఆలోచనే. అయితే దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. సహదేవన్ (మురళీ గోపీ) పాత్ర ప్రవేశించినప్పటి నుంచీ కాస్త కన్‌ఫ్లిక్ట్ మొదలవుతుంది. అయితే ఇంట్రవెల్ తరవాత కూడా కథనంలో వేగం రాదు. దర్శకుడు ఏవేవో చెప్పుకొంటూ వెళ్తుంటాడు. అవేం పెద్దగా రిజిస్టర్ కావు. మైండ్ గేమ్ తో పెద్దగా పని లేకుండా సన్నివేశాలు సాగుతుంటాయి. జీతూ నుంచో, దృశ్యం ఫ్రాంచైజీ నుంచో.. ప్రేక్షకులు ఇంకా ఎక్కువ కోరుకొంటూ ఉంటారు. వాళ్లకి ఇవన్నీ సాధారణ సన్నివేశాలుగా అనిపిస్తాయి. అంతే తప్ప సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫీలింగ్ ఇవ్వవు. పైగా… దృశ్యం అనగానే తెలుగు ప్రేక్షకులకు రాంబాబు (వెంకటేష్) గుర్తొస్తాడు. తెలుగులో రీమేక్ చూసి, అలవాటు చేసుకోవడం వల్ల.. కొన్ని పాత్రలు, వాటి నేపథ్యం తెలుగు ప్రేక్షకులకు కొంత కొత్తగా అనిపించొచ్చు.

సినిమా మరో 30 నిమిషాల్లో ముగుస్తుందగా దర్శకుడు మళ్లీ పట్టు సాధించాడు. అక్కడ సహదేవన్ పాత్రని మరింత యాక్టీవ్ చేశాడు. అంతేకాదు… ప్రభాకరన్ (సిద్దిఖీ) పాత్రని తీసుకురావడం, తాను రివైంజ్ కోసం ఓ డ్రామా ఆడడం ఇవన్నీ.. పర్‌ఫెక్ట్ గా కుదిరాయి. ఈసారి జార్జ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొంటాడో అనే ఆసక్తిని పెంచాయి. అయితే ఇప్పుడు కూడా జార్జ్ తన ప్రత్యర్థుల కంటే ఓ అడుగు ముందే ఆలోచిస్తాడన్న విషయం ప్రేక్షకులకు తెలుసు. హీరో గెలుపు ప్రేక్షకులకు కొత్తగా అనిపించదు కానీ, కాస్త థ్రిల్ అయితే కలిగిస్తుంది. `ఇకనైనా వదలేద్దాం… ఈ కథకు ముగింపు పలుకుదాం` అని ఓ పాత్రతో చెప్పించి `పార్ట్ 3`తో దృశ్యం ఫ్రాంచైజీకి శుభం కార్డు వేసినట్టు కనిపించారు. కానీ.. చివర్లో `నాకు అది కావాలి` అని ఐజీ గీతా (ఆశా శరత్‌) తన భర్తని కోరడంతో జీతూ ఈ కథని ఇంకా కొనసాగించాలని అనుకొంటున్నాడన్న సంగతి అర్థం అవుతుంది. సో.. పార్ట్ 3 ఫలితం ఎలా ఉన్నా, పార్ట్ 4 కోసం సిద్ధంగా ఉండాల్సిందే.

మోహన్ లాల్ పాత్ర ఔచిత్యం తెలిసిన నటుడు. జార్జ్ పాత్రకు ఎంత కావాలో అంతా చేశాడు. అంతే చేశాడు. ఒక్క మిల్లీ మీటర్ కూడా ఎక్కువ నటించలేదు. ఓ సగటు తండ్రిగా మరోసారి ఆకట్టుకొన్నాడు. మురళీ గోపీలో క్రూరత్వం ఉట్టిపడింది. తన కళ్లు కూడా భయంకరంగా కనిపించాయి. మీనా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. పిల్లల పాత్రలూ అంతే.

జీతూ 'దృశ్యం' ఫ్రాంచైజీని ఓ థ్రిల్లర్ గా చూడడం లేదు. ఫ్యామిలీ డ్రామానే అనుకొంటున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సిరీస్ ని థ్రిల్లర్ గానే అనుకొంటున్నారు. వాళ్లకు సీట్ ఎడ్జ్ మూమెంట్స్ ఇవ్వాల్సిందే. ఈ విషయంలో 'పార్ట్ 3' కొంత తడబడింది. పాటలు లేకపోవడం పెద్ద ప్లస్‌. రెండు మూడు లొకేషన్లతోనే సినిమాని నడిపించేశారు. ఈ కథకు అంతకు మించి అవసరం కూడా లేదు. ఫస్టాఫ్ లో లాగ్, సెకండాఫ్ లో కొంత విసుగు లేకుండా ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో మాత్రం జీతూ తన మార్క్ చూపించాడు. అదే బిగి.. ఫస్టాఫ్ లో కూడా ఉంటే బాగుండేది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360