Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐ చిప్ పవర్ - తైవాన్ సూపర్ పవర్

ఏఐ చిప్ పవర్ - తైవాన్ సూపర్ పవర్

Telugu 360 3 weeks ago

గ్లోబల్ స్టాక్ మార్కెట్ సమీకరణాల్లో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. భౌగోళికంగా అతిచిన్న దేశమైన తైవాన్, స్టాక్ మార్కెట్ విలువలో భారత్‌ను మించిపోయింది.

తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ సుమారు 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, భారత మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. దీంతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా తైవాన్ అవతరించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సునామీ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ విప్లవం తైవాన్‌కు వరంగా మారింది. ఏఐ టెక్నాలజీకి అత్యంత కీలకమైన సెమీకండక్టర్ చిప్స్ తయారీలో తైవాన్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ అయిన తైవాన్ సెమీ కండక్టర్ మ్యాన్యూ్ఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్లు ఈ ఏడాది ఏకంగా 49 శాతం పెరిగాయి. తైవాన్ స్టాక్ ఇండెక్స్‌లో ఈ ఒక్క కంపెనీ వాటాయే 42 శాతం వాటా ఉంది. అంటే, తైవాన్ మార్కెట్ పెరుగుదల దాదాపుగా ఈ చిప్ దిగ్గజం భుజస్కంధాల పైనే సాగుతోంది.

నిబంధనల సడలింపు - పెట్టుబడుల వెల్లువ

తైవాన్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కూడా ఈ వృద్ధికి ఊతమిచ్చాయి. ఒకే కంపెనీలో దేశీయ ఫండ్లు ఎంత మేరకు పెట్టుబడి పెట్టవచ్చనే పరిమితిని ప్రభుత్వం సడలించింది. దీనివల్ల సుమారు 6 బిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడులు మార్కెట్లోకి వచ్చాయి. ఈ పరిణామం అంతర్జాతీయ ఇన్వెస్టర్లను కూడా ఆకర్షించింది. ఫలితంగా గ్లోబల్ ఫండ్స్ ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి నిధులను ఉపసంహరించుకుని, తైవాన్ వైపు మొగ్గు చూపుతున్నాయి.

భారత్ ఎందుకు వెనుకబడింది?

భారత మార్కెట్ ఈ ఏడాది సుమారు 8 శాతం మేర నష్టపోయింది. దీనికి ప్రధాన కారణం ఏఐ రంగానికి ప్రత్యక్షంగా సంబంధం ఉన్న భారీ టెక్ కంపెనీలు మన స్టాక్ మార్కెట్లో తక్కువగా ఉండటమే. దీనికి తోడు పెరిగిన ఇంధన ధరలు, రూపాయి బలహీనపడటం, విదేశీ ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. అయితే ఆర్థికంగా చూస్తే భారత్ జిడిపి, తైవాన్ జిడిపి కంటే నాలుగు రెట్లు పెద్దది. కానీ స్టాక్ మార్కెట్ విలువ మాత్రం టెక్నాలజీ ప్రభావంతో మారిపోయింది.

ఒకే ఒక కంపెనీ.. ప్రపంచాన్నే శాసిస్తోంది!

తైవాన్ విజయం వెనుక ఉన్న రహస్యం స్పెషలైజేషన్ . ఒక చిన్న దేశమైనా, ప్రపంచానికి కావాల్సిన టెక్నాలజీని తామే సరఫరా చేయాలనే పట్టుదలే వారిని ఈ స్థాయికి చేర్చింది. ఎన్విడియా , ఆపిల్ వంటి దిగ్గజాలకు చిప్స్ సరఫరా చేసే ఏకైక కేంద్రంగా తైవాన్ నిలవడమే ఈ అసాధారణ వృద్ధికి మూలం. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఏఐ హవా కొనసాగినంత కాలం తైవాన్ మార్కెట్ ఇలాగే దూసుకుపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360