రాజకీయాల్లో ఇప్పుడు అల్గారిథమ్ యుద్ధం మొదలైంది. మొన్నటి వరకు రోడ్ షోలు, బహిరంగ సభలే విజయకేతనాలు… ఇవాళ సోషల్ మీడియానే గెలుపునకు నిచ్చెన.. కానీ రేపు మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన అస్త్రంగా మారబోతోంది.
డిజిటల్ తెర వెనుక సాగే ఈ ఏఐ రాజకీయం ముందు ముందు పెను సంచలనాలు సృష్టించబోతోంది.
అన్ని రాజకీయ పార్టీలకూ ఏఐ వార్ రూమ్స్ అనివార్యం
రాజకీయ పార్టీలు.. ఇప్పుడు జనరేటివ్ ఏఐ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే దీని రుచి చూసిన పార్టీలు, 2026 నాటికి పూర్తిస్థాయి ఏఐ వార్ రూమ్స్ ను సిద్ధం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంటింటికీ వెళ్లే కార్యకర్త కంటే, మొబైల్‌లో పలకరించే ఏఐ అవతార్ ప్రాధాన్యత పెరగనుంది. సాంకేతికత ఎంత వరమో, అంతకంటే ఎక్కువ ముప్పును డీప్‌ఫేక్స్ రూపంలో మోసుకొస్తోంది. ప్రత్యర్థి పార్టీ నేతల ప్రతిష్టను దెబ్బతీయడానికి వారి ముఖాలతో అభ్యంతరకర వీడియోలు సృష్టించడం లేదా వారు ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆడియోలు మార్చడం ఇప్పుడు ఐటీ సెల్స్‌కు చిటికెలో పనిగా మారింది. ఎన్నికలకు కేవలం కొన్ని గంటల ముందు ఇలాంటి ఫేక్ వీడియోలు వదిలితే, అవి నిజమో కాదో తేలేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీనివల్ల ఓటరు తన నిర్ణయాన్ని తప్పుడు సమాచారం ఆధారంగా తీసుకునే ప్రమాదం పొంచి ఉంది.
పర్సనలైజ్డ్ క్యాంపెయిన్ - మీ ఫోన్‌లోకి నేరుగా నాయకుడు!
ఏఐ వల్ల సాధ్యమయ్యే మరో కీలక అంశం పర్సనలైజ్డ్ మైక్రో-టార్గెటింగ్ . మీ సోషల్ మీడియా అభిరుచులు, మీరు గూగుల్‌లో సెర్చ్ చేసే అంశాలను బట్టి మీకు ఏ సమస్య ముఖ్యం అనేది ఏఐ విశ్లేషిస్తుంది. మీకు నిరుద్యోగం సమస్య ఉంటే.. నిరుద్యోగంపై నాయకుడు మాట్లాడే వీడియో మీ ఫోన్‌కు వస్తుంది. మీకు రైతుల సమస్య ఉంటే.. వ్యవసాయంపై ఆయన ఇచ్చే హామీలు మాత్రమే మీకు కనిపిస్తాయి. అంటే కోట్లాది మంది ఓటర్లకు వేర్వేరుగా, వారి మనస్తత్వానికి తగ్గట్లుగా ఏఐ ద్వారా మేసేజ్‌లు వెళ్తాయి. ఇది ఓటరును మానసిక ప్రభావితం చేసే అత్యంత ప్రమాదకరమైన, సమర్థవంతమైన మార్గం.
మాయాలోకంలో నిజమెంత?
ప్రస్తుతం మన దేశంలో ఏఐ ప్రచారంపై పక్కా చట్టాలు లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. ఒకవైపు ఎన్నికల సంఘం ఏఐ దుర్వినియోగంపై హెచ్చరికలు జారీ చేస్తున్నా, అజ్ఞాతంలో ఐటీ సెల్స్ మాత్రం విదేశీ సర్వర్ల ద్వారా వీటిని ప్రయోగిస్తున్నాయి. ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోవడానికి మళ్ళీ ఏఐ టూల్స్ నే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో గెలుపోటములను రోడ్లపై ఉండే జనం కంటే, తెర వెనుక ఉండే అల్గారిథమ్‌లే డిసైడ్ చేస్తాయనడంలో సందేహం లేదు. టెక్నాలజీని వాడుకోవడంలో వెనుకబడిన పార్టీలు రాజకీయంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అయితే, ఓటర్లుగా మనం చూసేది నిజమా? లేక ఏఐ సృష్టించిన భ్రమనా? అని విశ్లేషించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. డిజిటల్ మాయాజాలాన్ని దాటుకుని నిజాయితీ ఉన్న నాయకుడిని ఎన్నుకోవడమే ఇప్పుడు ప్రజాస్వామ్యానికి అసలైన సవాల్.

