Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎడిటర్స్ కామెంట్: పొదుపు మరో సంక్షోభం కాకూడదు!

ఎడిటర్స్ కామెంట్: పొదుపు మరో సంక్షోభం కాకూడదు!

Telugu 360 1 week ago

" దేశం అంటే మట్టి కాదు .. దేశం అంటే మనుషులు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడం దేశానికి కవచం లాంటిదైతే, సామాన్యుడికి ఉపాధి కల్పించడం దేశానికి గుండె చప్పుడు లాంటిది.

కవచం కోసం గుండె చప్పుడును ఆపుకోవడం మూర్ఖత్వం"
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ సంక్షోభం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెను సవాలుగా మారింది. ఈ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా చేసిన పొదుపు పిలుపు దేశంలో కొత్త చర్చకు కారణం అవుతోంది. అయితే ఈ పొదుపు ప్రయత్నాలు.. ముందు జాగ్రత్తల పేరుతో అసలుకే మన ఆర్థిక వ్యవస్థకు చేటు తెచ్చుకునేలా ఉండకూడదన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది.

డాలర్లను కాపాడుకోవాలి - అందులో సందేహమే లేదు!

బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం, ఇంధన పొదుపు వంటివి వినడానికి సాధారణంగా అనిపించినా, వాటి వెనుక ఉన్న అసలు కారణం క్షీణిస్తున్న విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే. దేశ ప్రజలకు పిలుపునిచ్చిన పొదుపు మంత్రాన్ని కేవలం అభ్యర్థనగా కాకుండా, దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక హెచ్చరికగా పరిగణించాలి. ప్రధాని మోదీ బంగారం కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేయడం, ఇంధన వినియోగంలో పొదుపు పాటించడం వంటివి పైకి సాధారణ అంశాలుగా కనిపించినప్పటికీ, వీటి వెనుక లోతైన ఆర్థిక తర్కం దాగి ఉంది. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 106 డాలర్ల మార్కును అధిగమించడం భారత ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా పరిణమించింది. తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకునే భారత్‌కు, పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతలు సరఫరా గొలుసును ఛిన్నాభిన్నం చేసే ముప్పుగా పరిణమించాయి. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగితే, దశాబ్దాలుగా మనం ఎంతో కష్టపడి కూడబెట్టిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. డాలర్ నిల్వల క్షీణత నేరుగా రూపాయి విలువను పాతాళానికి నెట్టివేస్తూ, దేశీయంగా ద్రవ్యోల్బణ సెగను రాజేసే అవకాశం ఉంది. ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే, చమురు ధరలు ప్రతి పది డాలర్లు పెరిగినప్పుడల్లా మన కరెంట్ అకౌంట్ లోటు సుమారు 12 బిలియన్ డాలర్ల మేర విస్తరిస్తుందని అంచనా. ఈ అపారమైన ఆర్థిక భారాన్ని మోయడం వర్ధమాన ఆర్థిక వ్యవస్థకు పెను సవాలే. ఈ విపత్తును ముందే పసిగట్టిన ప్రధాని మోదీ, ప్రజలకు చేసిన సెల్ఫ్ అప్పీల్ ఒక వ్యూహాత్మక ముందస్తు చర్య. నాడు ఆహార సంక్షోభం వేళ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ఒక పూట ఉపవాసం పిలుపు దేశ ప్రజల ఆకలిని నియంత్రించడమే లక్ష్యంగా సాగితే, నేటి ప్రధాని పిలుపు దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడే ఇంధన-ఆర్థిక క్రమశిక్షణగా మనం గుర్తించాలి. ఇది కేవలం పొదుపు మంత్రం మాత్రమే కాదు, అంతర్జాతీయ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించే ఒక సామాజిక బాధ్యత.

పొదుపు మంత్రం రెండు వైపులా పదునున్న ఆర్థిక ఖడ్గం!

అయితే, ఈ పొదుపు మంత్రం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒక వైపు డాలర్లను పొదుపు చేస్తూ విదేశీ నిల్వలను కాపాడుకోవాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, ఈ పొదుపు నియంత్రణల వల్ల మరోవైపు దేశీయంగా కన్స్యూమర్ డిమాండ్ దెబ్బతింటే అది ఆర్థిక వ్యవస్థను మాంద్యం కోరల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకుంటే, అది పరోక్షంగా మార్కెట్‌లో వస్తువుల విక్రయాలను తగ్గించి, పారిశ్రామికోత్పత్తిని కుంటుపరుస్తుంది. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను నియంత్రించాలని ప్రధాని చేసిన ప్రతిపాదనలు ట్రావెల్ , టూరిజం వంటి రంగాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల విమానయాన రంగానికి ఇంధన ధరల భారం పెరగగా, ఇప్పుడు అవుట్‌బౌండ్ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తే ఏజెన్సీల లాభాలు పడిపోయే ప్రమాదం ఉంది. పర్యాటక రంగం ద్వారా లభించే ఆదాయం పడిపోవడం వల్ల, ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి అనిశ్చితిలో పడుతుంది. ఇది కేవలం ఒక రంగానికి పరిమితం కాకుండా, మొత్తం సేవా రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బంగారం దిగుమతుల్ని నియంత్రించడానికి కేంద్రం ఇప్పటికే పన్నుల్ని భారీగా పెంచింది. అదే సమయంలో నీతిఆయోగ్ చేసినట్లుగా ప్రచారం అయిన ప్రతిపాదనలు మరింత భయోత్పాతం సృష్టించాయి. నీతి ఆయోగ్ ప్రతిపాదనల మేరకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్రటేరియట్ వంటి భారీ నిర్మాణ ప్రాజెక్టులను రెండేళ్ల పాటు నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే, నిర్మాణ రంగం అనేది దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా, సుమారు 5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం. కేవలం ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా భారీ ప్రాజెక్టులను ఆపేస్తే, ఈ రంగంపై ఆధారపడిన అసంఘటిత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. సిమెంట్, స్టీల్ వంటి అనుబంధ పరిశ్రమలు కూడా డిమాండ్ లేక తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఒకరి ఖర్చు, మరొకరి ఆదాయం. ప్రభుత్వం , ప్రజలు తమ ఖర్చులను భారీగా తగ్గించుకుంటే, మార్కెట్‌లో నగదు చలామణి తగ్గుతుంది. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. తద్వారా మార్కెట్‌లో వస్తువుల వినియోగం తగ్గి, ఉత్పత్తి రంగం కూడా సంక్షోభంలో పడుతుంది. ఫలితంగా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించి, ఉద్యోగాల్లో కోతలు విధిస్తాయి. ఇది ఒక విషవలయంలా మారి, ఆర్థిక వ్యవస్థను అట్టడుగుకు నెట్టివేస్తుంది. ఈ పరిస్థితిని మనపై మనమే యుద్ధం చేసుకున్నట్లుగా అవుతుంది.

పొదుపు మితిమీరితే సంక్షోభమే

పొదుపు చర్యలు మితిమీరితే అది దేశాన్ని అనివార్యంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ప్రభుత్వ ఖజానాలో డాలర్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, దేశీయంగా ప్రజల జేబుల్లో డబ్బు లేకపోతే పేదరికం పెరిగే ప్రమాదం ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు దేశ ఆర్థిక భద్రతకు అత్యంత అవసరమే, కానీ ఆ భద్రత సామాన్యుడి కడుపు నింపలేనప్పుడు అది తన ప్రాథమిక లక్ష్యాన్ని కోల్పోతుంది. వృద్ధి రేటును బలిపెట్టి చేసే పొదుపు ఎప్పటికీ దేశానికి దీర్ఘకాలిక మేలు చేయదు సరికదా, ఆర్థిక చక్రాన్ని నెమ్మదింపజేస్తుంది. పశ్చిమాసియా సంక్షోభం వంటి గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి అప్రమత్తత అవసరమే, కానీ అది ఆర్థిక చక్రం పూర్తిగా ఆగిపోయేలా ఉండకూడదు. ప్రభుత్వం తన పొదుపు చర్యలను కేవలం విలాసవంతమైన దిగుమతులకు, అనవసరపు పరిపాలనా ఖర్చులకు మాత్రమే పరిమితం చేయాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి దెబ్బతినకుండా ఉంటుంది. లేనిపక్షంలో, వినియోగం తగ్గిపోయి పారిశ్రామికోత్పత్తి కుంటుపడే అవకాశం ఉంది.
ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన , భారీ ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేయడం కంటే, వాటిని గరిష్టంగా స్వదేశీ వనరులతో పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. దీని వల్ల డాలర్ల రూపంలో విదేశీ మారకం ఆదా అవ్వడమే కాకుండా, స్థానికంగా కోట్లాది మందికి ఉపాధి లభిస్తుంది. సామాన్యుడి ఉపాధిని కాపాడటం ద్వారా మాత్రమే దేశీయ మార్కెట్‌లో డిమాండ్‌ను సజీవంగా ఉంచడం సాధ్యమవుతుంది. ప్రస్తుత తరుణంలో డాలర్లను కాపాడుకుంటూనే, దేశీయంగా ప్రజల ఆదాయాలను రక్షించే బ్యాలెన్స్‌డ్ ఆర్థిక వ్యూహమే దేశానికి తక్షణావసరం. విదేశీ మారకద్రవ్య నిల్వల రక్షణ అనేది సామాన్యుడి ప్రయోజనాలకు విఘాతం కలిగించకూడదు. ఒకవేళ ఈ సమతుల్యతను సాధించడంలో విఫలమైతే, అంతర్జాతీయ సంక్షోభం నుంచి బయటపడినప్పటికీ, స్వదేశీ మాంద్యం గుప్పిట్లో చిక్కుకోవడం ఖాయం. దీని వల్ల అసలు ఎవరో యుద్ధం చేస్తే మనకు మనం శిక్ష వేసుకున్నట్లుగా అవుతుంది.

పరిష్కారం పొదుపు మాత్రమే కాదు.. ఎగుమతుల వృద్ధి!

మన విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి దిగుమతులను నియంత్రించడం అనేది ఒక తాత్కాలిక రక్షణ చర్య మాత్రమే. అయితే, డాలర్లను నిరంతరం సంపాదించడానికి ఎగుమతులను గణనీయంగా పెంచడమే దేశ ఆర్థిక వ్యవస్థకు శాశ్వత పరిష్కారం. అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగినప్పుడే మన రూపాయి బలపడుతుంది. కేవలం ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా, ఆదాయ మార్గాలను అన్వేషించడం ద్వారానే మనం పశ్చిమాసియా వంటి భౌగోళిక రాజకీయ సంక్షోభాలను తట్టుకోగలం. ముఖ్యంగా ఇంధన రంగంలో మనం అనుసరించాల్సిన వ్యూహం మారాలి. కేవలం పెట్రోల్ పొదుపు చేయమని ప్రజలను కోరడం కంటే, ఎలక్ట్రిక్ వాహనాలు , గ్రీన్ హైడ్రోజన్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను వేగవంతం చేయాలి. ముడిచమురు దిగుమతులపై మనకున్న ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లడమే అసలైన ఆర్థిక స్వతంత్రం. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరిగితే, మన డాలర్లు ఆదా అవ్వడమే కాకుండా పర్యావరణ హితమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మరోవైపు, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని నిర్మాణ రంగంలోకి మరింత లోతుగా తీసుకెళ్లాలి. భారీ ప్రాజెక్టులలో విదేశీ యంత్రాలు, దిగుమతి చేసుకున్న ముడి పదార్థాల వాడకాన్ని తగ్గించి, స్వదేశీ పరికరాలను ప్రోత్సహించాలి. దీనివల్ల విలువైన విదేశీ మారకం ఆదా అవ్వడమే కాకుండా, స్థానికంగా సూక్ష్మ, చిన్న , మధ్యతరహా పరిశ్రమలకు కొత్త ఊపిరి అందుతుంది. ఫలితంగా క్షేత్ర స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరిగి, దేశీయ ఆదాయ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ప్రధాని మోదీ ఆస్టరిటీ పిలుపులోని అంతరార్థం దేశ ఆర్థిక భద్రతను కాపాడటమే. నీ, ఆ భద్రత సామాన్యుడి జీవనోపాధిని పణంగా పెట్టేలా ఉండకూడదు. పొదుపు చర్యలు కేవలం ప్రభుత్వ విలాసాలకు, అనవసరపు దిగుమతులకు మాత్రమే పరిమితం కావాలి. పశ్చిమాసియా సంక్షోభం మనకు నేర్పుతున్న అతిపెద్ద పాఠం ఒక్కటే - "మనం ఎంత త్వరగా ఇంధన స్వయంసమృద్ధిని సాధిస్తే, మన డాలర్లు , మన ఉపాధి అంత సురక్షితంగా ఉంటాయి. సంక్షోభ సమయాల్లో పొదుపు చేయడం విజ్ఞత అనిపించుకుంటుంది, కానీ ఆ పొదుపుతో భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలి తప్ప, ఉన్న ఉపాధి పునాదులను కదిలించకూడదు. పౌరుల ఉపాధిని రక్షిస్తూనే, దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకునే సమతుల్య వ్యూహమే నేటి భారతానికి అత్యవసరం.

ప్రజల్ని సిద్ధం చేయాలి!

ప్రధాని మోదీ ఆస్టరిటీ పిలుపులు దేశ ఆర్థిక భద్రత దృష్ట్యా సమర్థనీయమైనవే అయినప్పటికీ, నీతి ఆయోగ్ వంటి అత్యున్నత విధాన రూపకల్పన సంస్థలు చేస్తున్న కొన్ని సిఫారసులు ఆర్థిక వ్యవస్థ గమనానికి విఘాతం కలిగించేలా ఉన్నాయన్నది కాదనలేని సత్యం. భారీ నిర్మాణాలను నిలిపివేయడం ,వ్యయ నియంత్రణ పేరుతో అభివృద్ధి ప్రాజెక్టులను వాయిదా వేయడం వంటి చర్యలు ఆర్థిక చక్రాన్ని స్తంభింపజేస్తాయి. సంక్షోభ సమయంలో నిశ్చలత్వం కంటే క్రియాశీలత అవసరం. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే అవి కేవలం ప్రాజెక్టులకే కాదు, దేశ అభివృద్ధి వేగానికి కూడా గొడ్డలిపెట్టుగా మారుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సునిశితమైన ఆర్థిక నిర్ణయాల విషయంలో అత్యంత జాగ్రత్తగా, దూరదృష్టితో వ్యవహరించాల్సి ఉంది. పొదుపు అనేది అనవసరపు ఖర్చులకు కళ్లెం వేయడానికి ఉపయోగపడాలి తప్ప, ఉపాధినిచ్చే రంగాలను ఊపిరాడకుండా చేయకూడదు. పెట్టుబడులు మందగిస్తే, అది ఉత్పత్తి రంగాన్ని దెబ్బతీసి, నిరుద్యోగితకు దారితీస్తుంది. ఒకసారి ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఛాయలు ప్రవేశిస్తే, తిరిగి దానిని పట్టాలెక్కించడం అసాధ్యం కాకపోయినా అత్యంత ఖరీదైన ప్రక్రియగా మారుతుంది. విదేశీ గండం నుంచి బయటపడాలనే ఆత్రుతలో దేశీయంగా ఆర్థిక పునాదులు కదలకుండా చూసుకోవడం పాలకుల ప్రాథమిక బాధ్యత. డాలర్ నిల్వలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, సామాన్యుడి చేతిలో చిల్లిగవ్వ అయినా ఉండేలా చూడటం అంతే ముఖ్యం. పొదుపు చర్యలు, ఆర్థిక వృద్ధి మధ్య సమతుల్యత దెబ్బతింటే, అది దేశ భవిష్యత్తుకే ముప్పుగా పరిణమిస్తుంది. అప్రమత్తత అవసరమే, కానీ అది విజ్ఞతతో కూడినదై ఉండాలి. అప్పుడే భారత్ ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని సుస్థిరమైన ఆర్థిక శక్తిగా నిలబడగలదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360