Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎడిటర్స్ కామెంట్:   రాంగ్ లీడర్ !

ఎడిటర్స్ కామెంట్: రాంగ్ లీడర్ !

Telugu 360 1 hr ago

"అవసరం ఉన్నప్పుడు కాళ్లు పట్టుకోవడం.. అవసరం తీరాక జుట్టు పట్టుకోవడం!. తాను ఏం చేశారో అదే తప్పు అని అధికారం పోయాక గగ్గోలు పెట్టడం. అధికారం కోసం నిత్యం మడమ తిప్పుతూ, మాట తప్పడాన్నే నైతికతగా భ్రమించే నేతకు రాజకీయం చేసే అర్హత ఒక్క శాతమైనా ఉందా?"

రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు అనేవి ఒక నాయకుడి నైతిక బలానికి కొలమానాలు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో విశ్వసనీయత అనే పదానికి పూర్తిగా భిన్నమైన అర్థం చెప్పిన ఏకైక నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. తన రాజకీయ ప్రయోజనాల కోసం, కేసుల నుంచి రక్షణ కోసం, లేదా తాత్కాలిక లబ్ధి కోసం ఎప్పుడు ఏ మాట చెప్తారో, ఏ స్టాండ్ తీసుకుంటారో ఆయనకే తెలియని దుస్థితి! . ఎన్నికల కమిషన్ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులకు మద్దతు ఇవ్వడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ అవకాశవాద రాజకీయాలకు సజీవ సాక్ష్యం. నాడు ఆ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చి తప్పు చేశాం అని జగన్ రెడ్డి ే ఏ మాత్రం సిగ్గు పడకుండా ప్రకటించుకున్నారు.

అన్నీ తెలిసి మద్దతు ప్రకటించి..ఇప్పుడు తప్పు చేశా అంటే సరిపోతుందా?

పార్లమెంట్‌లో అనుభవజ్ఞులైన ఎంపీలు ఉన్న పార్టీకి, కేంద్ర చట్టాల పరిణామాలు తెలియకుండానే మద్దతు ఇచ్చారా? ఖచ్చితంగా కాదు! నాడు కేంద్రంలోని బీజేపీ పెద్దల దయాదాక్షిణ్యాలు కావాలి, సిబిఐ, ఈడీ కేసుల పురోగతి నెమ్మదించాలి, బెయిల్ రద్దు కాకుండా చూసుకోవాలి. అందుకోసమే కళ్లు మూసుకుని బీజేపీ తెచ్చిన ప్రతీ బిల్లుకూ జై కొట్టారు. నేడు జాతీయ స్థాయిలో సీఈసీ నియామకాలపై వ్యతిరేక ఉద్యమాలు జరుగుతుండటం, విపక్షాల కూటమి గళం విప్పుతుండటంతో.. మళ్లీ తన అమాయకత్వాన్ని నటిస్తూ "నేను తప్పు చేశాను" అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రెడ్డి నైజం ఎంత దారుణమైనదంటే.. తన స్వార్థం కోసం ఏ క్షణంలోనైనా, ఎవరినైనా బలిపశువును చేయగలరు. ఈ ధోరణికి గతం లో ఏపీ అసెంబ్లీ వేదికగా జరిగిన ఒక సంఘటన స్పష్టమైన నిదర్శనం. నాడు అధికారంలో ఉన్న ప్రారంభ రోజుల్లో శాసనసభ వేదికగా విమర్శలు ఎదురైనప్పుడు.. సాక్షిలో రాసిన దాన్ని అధికారపక్షం చూపించినప్పుడు.. తన సొంత పత్రిక 'సాక్షి'ని, దానికి పనిచేసే జర్నలిస్టుల విశ్వసనీయతను సైతం నడిరోడ్డుపై నిలబెట్టారు. సన్నబియ్యం ఇస్తామని ప్రకటించిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు చూపించినప్పుడు.. "అధ్యక్షా.. సాక్షి పేపర్‌లో తప్పు రాశారు,అది పొరపాటు" అని అసెంబ్లీ సాక్షిగా అత్యంత తేలికగా ఒప్పుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

గతంలో సొంత సాక్షినే తప్పు రాసిందనేసిన నైజం !

సొంత మీడియా సంస్థను, తన కోసం రాత్రింబవళ్లు పనిచేసే సిబ్బందిని ఒక రాజకీయ విమర్శ నుంచి కాపాడుకోలేక, వ్యవస్థ ముందే వారిని పాతరేసిన అధినేత జగన్ మోహన్ రెడ్డి. తన తప్పును ఇతరులపైకి నెట్టేయడం.. లేదా మీడియాపై సానుభూతి కోసం నిందలు వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తప్పులు చేయడం, దొరికిపోతే తప్పు రాశారు, తప్పు విన్నాను, మద్దతు ఇచ్చి తప్పు చేశాను అని బుకాయించడం ఆయన రోజూవారీ నైజంగా మారింది. కానీ, ఆ తప్పులకు చట్టపరంగా గానీ, నైతికంగా గానీ శిక్ష అనుభవించడానికి మాత్రం ఆయన సిద్ధంగా ఉండరు!. ఉదయం ఒక మాట.. సాయంత్రం మరో మాట.. అవసరాన్ని బట్టి సిద్ధాంతాలను మార్చేసే రాజకీయ ఊసరవెల్లి స్వభావమే జగన్ రెడ్డి నైజం. మాట తప్పను.. మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకునే ఆయన చరిత్ర నిండా నిలువెత్తు యూ-టర్న్‌లే!

గుండెకాయ లాంటి అమరావతి రాజధాని విషయంలో ఆయన ఆడిన నాటకం ఎప్పటికీ ఎవరికీ మరువలేనిది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, అభినందించిన జగన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే ప్రాంతీయ విద్వేషాలు రగల్చడానికి"మూడు రాజధానుల డ్రామాను తెరపైకి తెచ్చారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, చివరికి ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత మళ్లీ యూ-టర్న్ తీసుకోవడం ఆయన నైజానికి పరాకాష్ట. మావిగన్ అంటూ కొత్త కథ అల్లారు. అలాగే శాసనమండలి తన దయాదాక్షిణ్యాలపై నడవాలని భావించి, రాత్రికి రాత్రే మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ఆయన.. మళ్లీ సీన్ రివర్స్ అయ్యేసరికి ఆ నిర్ణయాన్ని సైతం వెనక్కి తీసుకుని పలాయనవాదం ప్రదర్శించారు. సీఈసీ చట్ట సవరణల నుంచి అమరావతి రాజధాని వరకు, శాసనమండలి రద్దు నుంచి సొంత పత్రిక సాక్షిని నడిరోడ్డుపై నిలబెట్టడం వరకు.. జగన్ రెడ్డి ప్రతీ అడుగులోనూ స్పష్టత లోపించింది. కేవలం తన కేసుల నుంచి రక్షణ పొందడానికి, అధికారాన్ని అడ్డంపెట్టుకుని బతకడానికే ఆయన ప్రతీ నిర్ణయం మార్చుకుంటూ వచ్చారు. మాట తప్పడం, మడమ తిప్పడం, క్షమాపణలు చెప్పకుండా అబద్ధాలతో కాలం వెళ్లదీయడం ఆయన రాజకీయ శైలిగా మారింది. ఇలాంటి అస్థిరమైన,విశ్వసనీయత లేని నాయకుడికి ప్రజాస్వామ్యంలో కొనసాగే అర్హత ఒక్క శాతమైనా లేదనేది కాలం మిగిల్చిన తిరుగులేని సత్యం!

ఘర్షణలు సృష్టించి ఎన్నికల నుంచి పారిపోయేందుకు ప్రణాళికలు

గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తీరుతెన్నులు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయి. పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను పూర్తిగా అణచివేయడమే లక్ష్యంగా అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని సాగిన ఆ తతంగం రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూసిందే. నామినేషన్ల పర్వం ప్రారంభమైన క్షణం నుంచే విపక్ష అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడం, కిడ్నాప్ చేయడం, నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కోవడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగా స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న అధికార పార్టీ, మిగిలిన నామమాత్రపు స్థానాలకు మాత్రమే డమ్మీ ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు కరవై, పరాభవం ఖాయమని తెలిసినచోట, ఓటర్ల ముందుకు వెళ్లి ఓట్లు అడిగే నైతిక ధైర్యం లేక కావాలనే నామినేషన్ల కేంద్రాల వద్ద గొడవలు సృష్టిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం, చిన్నపాటి ఘటనలను భూతద్దంలో చూపించి ఎన్నికల ప్రక్రియపై లేనిపోని నిందలు మోపడం వారి నిత్యకృత్యంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ప్రజల తీర్పును నిష్పక్షపాతంగా ప్రతిబింబించే వేదికలు కావాలి తప్ప, అరాచకాలకు అడ్డాగా మారకూడదు. గతంలో తాము సాగించిన ఏకపక్ష బలప్రయోగాలను మర్చిపోయి, నేడు ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఎన్నికలను చూసి భయపడటం కేవలం వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రజలు ఎప్పుడో పరిణితి చెంది ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు కాబట్టి, ఇటువంటి సంచలనాత్మక ఆరోపణలు, కుట్రపూరిత డ్రామాలతో ఎన్నికల విశ్వసనీయతను దెబ్బతీయలేరు. కేవలం వైఎస్ఆర్‌సీపీ కంచుకోటలని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లోనే ఎందుకు గొడవలు జరుగుతున్నాయి. ఎప్పట్లాగే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి గొడవలు చేస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించడానికి ఓ కారణం వెదుక్కుంటున్నారు.

తల్లి,చెల్లికి న్యాయం చేయని వాడు ఎవరికి చేస్తాడు?

రాజకీయాల్లో విశ్వసనీయత గురించి మాట్లాడేవారికి, మాట తప్పను.. మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకునే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నైజానికి అసలు రూపం ఆయన కుటుంబసభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరులోనే స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాలంటే ఏమిటో, కష్టాలంటే ఏమిటో తెలియని తల్లి విజయమ్మను, తన వెన్నంటి ఉండి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లెలు వైఎస్ షర్మిలను రాజకీయ రంగంలోకి దించి.. ఆ తర్వాత అధికార మదంతో వారిని రోడ్డున పడేశారనేది అక్షర సత్యం. కేవలం ఆస్తుల పంపకాల్లో తన గుప్పిట నుంచి ఏ ఒక్క రూపాయి జారిపోకూడదనే స్వార్థంతో, కన్నతల్లిని సైతం కోర్టుల ద్వారా వేధించడానికి వెనుకాడని జగన్ క్రూరమైన మనస్తత్వాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. అంతేకాదు, రాజకీయ ప్రయోజనాల కోసం కన్నతల్లిని, చెల్లిని బహిరంగంగా విమర్శించిన, తీవ్ర పదజాలంతో దూషించిన బొత్స సత్యనారాయణ లాంటి నాయకులను గుండెలకు హత్తుకుని తండ్రి లాంటి నాయకుడని నెత్తిన పెట్టుకోవడం జగన్ దివాళాకోరుతనానికి నిదర్శనం. తల్లిని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కొడుకు స్థానంలో ఉండి, రాజకీయ శత్రువుల చేత సొంత కుటుంబంపై దూషణలు చేయించడం ఆయన సంకుచిత రాజకీయాలకు పరాకాష్ట. గతంలో షర్మిల కుమారుడి వివాహం సమయంలోనూ ముఖం చాటేసిన జగన్, ఇప్పుడు మేనకోడలి వివాహ వేదిక యలహంక ప్యాలెస్ విషయంలోనూ అడ్డంకులు సృష్టిస్తూ, పెళ్లి జరగకుండా కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు ఆయనలోని కక్షసాధింపు బుద్ధిని బట్టబయలు చేస్తున్నాయి. ఒక వైపు సొంత చెల్లెలు కుమార్తె, మేనకోడలి శుభకార్యానికి కూడా అడ్డుతగులుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్న జగన్ రెడ్డి.. మరోవైపు సామాజిక విలువల గురించి మాట్లాడటం మహా విడ్డూరం. రక్తం పంచుకున్న కుటుంబసభ్యుల పట్లే ఇంత దారుణంగా, నిర్దయగా వ్యవహరించే వ్యక్తి.. సామాన్య ప్రజల పట్ల, పార్టీ కోసం ప్రాణాలొగ్గే కార్యకర్తల పట్ల ఎంత కనికరంతో ఉంటారో వేరుగా చెప్పనక్కర్లేదు. కేవలం ఆస్తులు, అధికారమే పరమావధిగా బతికే ఇలాంటి స్వార్థపూరిత నాయకుడి అసలు స్వరూపాన్ని కుటుంబసభ్యులే కాక, ప్రజలందరూ ఇప్పటికే పూర్తిగా అర్థం చేసుకున్నారు.

వంద శాతం రాంగ్ లీడర్ జగన్ !

తనపై ఉన్న 11 సీబీఐ కేసులు, ఈడీ కేసులలో కూడా ఆయన వైఖరి ఇలాగే ఉంది. నాంపల్లి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతీచోటా విచారణను ఆలస్యం చేయడమే పనిగా పెట్టుకున్నారు. క్లాస్ రూమ్‌లో తప్పు చేసిన విద్యార్థికి కూడా శిక్ష ఉంటుంది.కానీ, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుతో ఆడుకుని, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి మాత్రం.. తన తప్పులకు బాధ్యత వహించకుండా, అంతా వ్యవస్థల కుట్ర, ప్రత్యర్థుల కుట్ర అని బుకాయించడం ఆయన నైతిక దివాళాకోరుతనానికి నిదర్శనం. జగన్ రెడ్డికి ఏనాడూ ఒక నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం లేదు. ఆయన సిద్ధాంతం ఒకటే.. తన అధికారం, తన కేసులు, తన ప్యాలెస్‌లు దీనికోసం ఆయన రేపు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోగలరు, ఏ చట్టాన్నైనా సమర్థించగలరు, మరునాడే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించగలరు. ఒక రోజు సీఈసీని తిడతారు, మరుసటి రోజు కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకుంటారు. ఒక రోజు అమరావతి అంటారు, మరుసటి రోజు విశాఖ అంటారు. ఇంతటి అస్థిరత్వంతో, నైతిక విలువలు లేకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును విక్రయించే నేతకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఒక్క శాతం కూడా లేదు. తప్పులను ఒప్పుకోవడం గొప్పతనమే, కానీ పదే పదే స్వార్థం కోసం తప్పులు చేస్తూ,ప్రజలను మభ్యపెట్టడం క్షమించరాని నేరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇకనైనా ఈ యూ-టర్న్ రాజకీయాలను, ఈ నకిలీ విశ్వసనీయత ముసుగును గుర్తించి.. శాశ్వతంగా ప్రజా జీవితం నుంచి తరిమికొట్టాల్సిన సమయం వచ్చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360