మెగాస్టార్ సినిమాకు సంగీతం అందించాలనే కల చాలామందికి ఉంటుంది. కానీ.. అందరికీ ఆ అవకాశం రాదు. తమన్ కూడా చిరంజీవి ఫ్యానే. ఆయనతో పని చేసే అవకాశం తమన్ కి చాలా అరుదుగానే దక్కుతోంది.
'గాడ్ ఫాదర్' సినిమాకు తమన్ సంగీతం అందించాడు. అయితే.. అందులో పాటలకు స్కోప్ లేదు. కొన్ని పాటలు ఉన్నా, మెప్పించలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రమే. ఓ సంగీత దర్శకుడిగా ఆ సినిమాకు తమన్ సంపూర్ణ న్యాయం చేయలేకపోయాడు. `గాడ్ ఫాదర్ రెగ్యులర్ కథ కాదు. కాబట్టి పాటలకు స్కోప్ లేకుండా పోయింది. అక్కడ నా మార్క్ చూపించలేకపోయాను.. పాటలకూ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కీ సమానంగా అవకాశం వస్తే బాగుండేది..` అని తమన్ చాలా సందర్భాల్లో వాపోయాడు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది.
చిరంజీవి - బాబీ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం అందించే బాధ్యత తమన్ ని వరించింది. 'గాడ్ ఫాదర్' లో మిస్సయిన ఎలిమెంట్స్‌ని.. ఈసారి రంగరించి, మెగా ఫ్యాన్స్ ని మెప్పించే బాధ్యత ఇప్పుడు తమన్ పైనే ఉంది.
నిజానికి ఈ సినిమా కోసం చాలామంది సంగీత దర్శకుల పేర్లు పరిశీలించారు. అనిరుథ్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు. బాబీ కూడా అనిరుథ్ ని టీమ్ లోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నించినట్టు టాక్. కానీ ఎందుకో కుదర్లేదు. తమన్ దగ్గర ఓ సౌలభ్యం ఉంది. చాలా ఫాస్ట్ గా మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. ప్రతీ చిన్న విషయానికీ అందుబాటులో ఉంటాడు. అందుకే బాబీ తమన్ వైపు మొగ్గు చూపించాడని తెలుస్తోంది.

