ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ ఐపీఎస్ అధికారి ఎ.కె. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ , దాడి కేసు నమోదు చేశారు.
"మహారాజ్ఞి" అనే సినిమాను నిర్మిస్తున్న వెంకట అనీష్ రెడ్డి అనే చిత్ర నిర్మాతను పెట్టుబడిదారుల పేరుతో బురిడీ కొట్టించి రూ. 50 లక్షలు వసూలు చేయడమే కాకుండా, డబ్బులు తిరిగి అడిగినందుకు భౌతిక దాడికి దిగినట్లు కేసు పెట్టారు. రాజకీయ, అధికార వర్గాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లు ఈ వివాదంలోకి రావడంతో నగరంలో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాధితుడు అనీష్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆయన గత రెండేళ్లుగా మహారాజ్ఞి సినిమా నిర్మాణ పనుల్లో ఉన్నారు. సినిమాకు పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల కోసం వెతుకుతున్న తరుణంలో జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని సన్‌లిట్ గ్రూప్ కార్యాలయంలో మొహ్సిన్ ఖాన్, అతనికి బంధువైన తబ్రైజ్‌లతో పరిచయం ఏర్పడింది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను పరిచయం చేసి సినిమాకు భారీగా ఫండింగ్ ఇప్పిస్తామని వారు నమ్మబలికారు. ఈ మాటలు నమ్మి అనీష్ రెడ్డి 2025 ఆగస్టులో మొహ్సిన్‌కు రూ. 25 లక్షలు ఇచ్చుకోగా, తబ్రైజ్ కూడా మూడు విడతల్లో మరో రూ. 25 లక్షలు వసూలు చేశాడు. అయితే, నెలలు గడుస్తున్నా ఒక్క ఇన్వెస్టర్‌ను కూడా పరిచయం చేయకపోగా, అడిగినప్పుడల్లా కాలయాపన చేస్తూ వచ్చారు.
ఈ మోసంపై నిలదీసేందుకు నిర్మాత అనీష్ రెడ్డి జులై 1 మధ్యాహ్నం 3:10 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లోని సన్‌లిట్ గ్రూప్ ఆఫీసుకు వెళ్లారు. అయితే, అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆఫీసులో ఉన్న మొహ్సిన్ ఖాన్ బాధితుడిని ఒక గదిలోకి పిలిచి, తిరిగి డబ్బులు అడుగుతావా ఏం చేస్తావో చూస్తా అంటూ వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న బౌన్సర్లు ఆయుధాలు చూపిస్తూ నిర్మాతను తీవ్రంగా బెదిరించడమే కాకుండా, మొహ్సిన్ అతని దవడపై బలంగా పంచ్ ఇచ్చాడు. బౌన్సర్లు కూడా అనీష్‌పై చేతులతో దాడికి దిగారు. ఈ హింస జరుగుతున్న సమయంలో నిందితుడు తబ్రైజ్ ఫోన్ లైన్ లో ఉంటూ మొహ్సిన్‌ను మరింతగా రెచ్చగొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న మొహ్సిన్ ఖాన్ కేవలం మాజీ ఐపీఎస్ అధికారి కొడుకే కాకుండా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి అల్లుడు కూడా కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తబ్రైజ్ కూడా షబ్బీర్ అలీకి బంధువుగా సమాచారం.

