తెలంగాణలో పదేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోయిన రియల్ ఎస్టేట్ రంగంపై ఇటీవల కాలంలో అస్థిరమైన విధానాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హైడ్రా కూల్చివేతల భయం, అనుమతుల ప్రక్రియలో వచ్చిన మార్పులతో ఇప్పటికే కొంత మందగించిన రియాల్టీ రంగాన్ని మరిన్ని ప్రయోగాలతో ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో టీజీబీపాస్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో వేగంగా వచ్చే భవన నిర్మాణ అనుమతుల స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ బిల్డ్ నౌ విధానాన్ని తెచ్చినప్పటికీ ఆశించిన వేగం కనిపించడం లేదు. ఈ తరుణంలో ఢిల్లీ, ముంబై నగరాల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ఏకీకృత భవన నిర్మాణ నియామవళి ని తీసుకురావాలనే ఆలోచన రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితి, విస్తరణ శైలి ఉన్నాయి. ఇక్కడి మార్కెట్ అవసరాలు వేరు, ఢిల్లీ లేదా ముంబై వంటి మెట్రో నగరాల ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలు వేరు. అయితే, తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర రాజధాని మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ఒకే విధమైన నిబంధనలను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం వల్ల కేవలం మహానగరాల పరిధిలోనే సాధ్యమయ్యే సంక్లిష్టమైన స్క్రీనింగ్ పద్ధతులు, మౌలిక వసతుల నిబంధనలు పల్లెలు, చిన్న పట్టణాలకూ వర్తిస్తాయి. దీనివల్ల అనుమతుల ప్రక్రియ మరింత జాప్యమై, చిన్న స్థాయి నిర్మాణాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు కఠినతరంగా మారి, అనుమతుల్లో జాప్యం జరిగితే అది నేరుగా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమవుతుంది. ఫలితంగా అపార్ట్‌మెంట్లు, ఇళ్ల ధరలు సామాన్యుడి అంచనాలకు మించి ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే పెరిగిన భూముల ధరలతో నలిగిపోతున్న మిడిల్ క్లాస్ కొనుగోలుదారులకు సొంతింటి కల మరింత దూరం కానుంది. మరోవైపు, ఈ కొత్త నిబంధనల వల్ల స్థానికంగా ఉండే చోటా, మోటా, మిడ్-రేంజ్ బిల్డర్లు మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కేవలం పెద్ద కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఈ క్లిష్టమైన రూల్స్‌ను తట్టుకుని నిలబడగలవని, తద్వారా మొత్తం రియాల్టీ రంగం కొద్దిమంది కార్పొరేట్ శక్తుల హస్తగతం అవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలను, ప్రాంతాల వారీగా ఉన్న వ్యత్యాసాలను గుర్తించి, ఉన్న నిబంధనలనే పారదర్శకంగా అమలు చేస్తేనే రియాల్టీ రంగానికి, సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.

