Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏకు మేకైన కొండా - కాంగ్రెస్ స్వయంకృతమే!

ఏకు మేకైన కొండా - కాంగ్రెస్ స్వయంకృతమే!

Telugu 360 6 days ago

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతోంది. సొంత పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

తనపై ఏమైనా క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందే సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఏకంగా పార్టీ హైకమాండ్‌నే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తనను మంత్రివర్గం నుంచి తప్పిస్తే, రాష్ట్రంలో ఉన్న 16 శాతం పద్మశాలీలు , తన భర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తిరగబడతాయని ఆమె బహిరంగంగా హెచ్చరించారు.

సొంత పార్టీపై కులాన్ని ఎక్కు పెట్టిన కొండా సురేఖ

సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీలను ముప్పుతిప్పలు పెట్టడానికి, ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి కుల సమీకరణాలను వాడుకుంటుంది. కానీ ఇక్కడ కొండా సురేఖ ఏకంగా సొంత కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి బిసి కులాల అస్త్రాన్ని ఉపయోగించడం అసలైన ట్విస్ట్. బిసి వర్గాలకు అన్యాయం జరుగుతోందనే భావనను ముందుకు తెస్తూ, తనపై వేటు పడితే పార్టీకి జరిగే నష్టాన్ని ముందే హెచ్చరించడం ద్వారా అధిష్ఠానంపై మానసిక ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ఆమె ఎంచుకున్నారు. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీర్గత వ్యవహారాల్లో పెద్ద కల్లోలానికే దారితీసేలా కనిపిస్తోంది.

ఇంత చాన్స్ ఇచ్చింది పార్టీ హైకమాండే !

కొండా సురేఖ ఇంతలా తెగించి మాట్లాడటానికి అధిష్ఠానం , రాష్ట్ర నాయకత్వం మొదటి నుంచి అనుసరించిన నిర్లక్ష్య వైఖరే కారణం. . సినీ నటుడు నాగార్జున కుటుంబంపై, సమంతపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడే పార్టీ కఠినమైన హెచ్చరికలు జారీ చేసి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు. ఆ తర్వాత కూడా ఓఎస్డీ పేరిట జరిగిన కొన్ని సెటిల్‌మెంట్ల ఆరోపణలు వచ్చిన సమయంలోనూ నాయకత్వం సరిగా స్పందించలేదు. ఫలితంగా చిన్నగా మొదలైన వివాదం ఇప్పుడు ఏకు మేకై సవాలు విసిరే స్థాయికి చేరింది.

రేవంత్‌ను బలహీనపరిచే ప్రయత్నంలో కాంగ్రెస్ తప్పటడుగు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా మరింత బలపడకుండా చూసేందుకు కాంగ్రెస్‌లోని కొందరు అంతర్గత ప్రత్యర్థులే కొండా సురేఖ వంటి నేతలను తెరవెనుక ప్రోత్సహించారు. రేవంత్‌ను కట్టడి చేసేందుకు వాడిన అస్త్రమే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి, హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. మంత్రివర్గం నుంచి ఆమెను తప్పిస్తే క్షేత్రస్థాయిలో బిసి కార్డుతో పెద్ద ఎత్తున తిరుగుబాటు రగిల్చేందుకు సురేఖ సిద్ధంగా ఉన్నందున అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360