తెలంగాణలో ఎల్ నినో ప్రభావం కారణంగా సంభవించే తీవ్ర ప్రతికూల పరిస్థితులు, కరువు కాటకాలను తట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెడుతోంది.
వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ రంగానికి జరిగే తీవ్ర నష్టం, తాగునీరు-సాగునీటి ఎద్దడి , గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదాన్ని గుర్తించిన సర్కార్.. తక్షణ సహాయక చర్యల కోసం సుమారు రూ. 10,000 కోట్లతో సమగ్ర ఉపశమన ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే, ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి నిర్దేశించిన అప్పుల పరిమితి దాదాపుగా పూర్తవ్వడంతో, ఈ అదనపు నిధుల సమీకరణ ప్రభుత్వానికి సవాలుగా మారింది.
ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిధుల కొరత లేకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అత్యవసర లేఖ రాసింది. ఎల్ నినో వల్ల తలెత్తే కరువు పరిస్థితులు, పంట నష్టాలు , తాగునీటి ఎద్దడిని నివారించడానికి చేసే అత్యవసర ఖర్చులను సాధారణ బడ్జెట్ అప్పుల పరిమితి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, ఎఫ్ఆర్బీఎమ్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, ప్రత్యేక మినహాయింపు కింద రూ. 10 వేల కోట్ల అదనపు అప్పులు తీసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.
ప్రస్తుతం ఉన్న అప్పుల పరిమితి తీరిపోవడంతో, ఈ అదనపు రుణాలు లభిస్తేనే బాధితులకు సమర్థవంతంగా సహాయక చర్యలు అందించే వెసులుబాటు ఏర్పడుతుంది. వ్యవసాయ రుణాల ఊరట, రైతులకు నష్టపరిహారం, ఉపాధి హామీ పథక విస్తరణ,సాగు నీటి యాజమాన్యం, పశుగ్రాసం సరఫరా వంటి ముందస్తు చర్యలకు ఈ నిధులను వెచ్చించాల్సి ఉందని లేఖలో సమగ్రంగా వివరించింది. కేంద్రం సానుకూలంగా స్పందించి రుణ పరిమితిని పెంచకపోతే, రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడి సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు మందగించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు, వాతావరణ మార్పుల వంటి అనివార్య విపత్తుల సమయంలో కేంద్రం నిబంధనలను సడలించి రాష్ట్రాలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎల్ నినో రూపంలో రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ అభ్యర్థనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటేనే తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల నుంచి రైతాంగాన్ని, సామాన్య ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఉపశమన చర్యలు చేపట్టడానికి మార్గం సుగమమవుతుంది.

