తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీ , ప్రజాప్రతినిధుల పనితీరు విషయంలో అవలంబిస్తున్న తీరు సొంత పార్టీ నేతల్లోనే హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో లాగా మొహమాటాలకు పోకుండా, తప్పులను సరిదిద్దుకోని ప్రజాప్రతినిధులను నేరుగా బహిరంగ వేదికలపైనే హెచ్చరించేందుకు ఆయన వెనకాడటం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జరిగిన అధికారిక పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి విషయంలో చంద్రబాబు వ్యవహరించిన శైలి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
ఎమ్మెల్యే స్థానం 107
నియోజకవర్గంలో మొత్తం 51 ప్రభుత్వ శాఖల పనితీరును తాను నిశితంగా గమనిస్తున్నానని, అందులో 13 కీలక శాఖల పనితీరులో కావలి చాలా వెనుకబడి ఉందని ముఖం మీదే చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు, శాఖల ప్రగతిని బేరీజు వేస్తే కావ్య కృష్ణారెడ్డి స్థానం 107వ ర్యాంకులో ఉందంటూ చంద్రబాబు బహిరంగంగా లెక్కలతో సహా బయటపెట్టడం అక్కడి రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. నియోజకవర్గంలో వర్గ రాజకీయాలను వీడి, అందరినీ కలుపుకుని పోవాలని, పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఊరుకునేది లేదని వేదికపైనే హెచ్చరించారు.
బహిరంగంగా హెచ్చరించడం అసలైన మార్పు
చంద్రబాబు సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాలను అంతర్గత సమీక్షలకే పరిమితం చేస్తుంటారు. కానీ, ఒక బహిరంగ సభలో, వేలాది మంది ప్రజల సమక్షంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ర్యాంకును ప్రస్తావిస్తూ పద్ధతిగా హెచ్చరించారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. బహిరంగంగానే ఇంత గట్టిగా చెబితే.. ఇక పార్టీ అంతర్గత సమావేశాల్లో లేదా సీఎంఓ రివ్యూలలో సదరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఏ రేంజ్‌లో చుక్కలు చూపించేవారోనని టీడీపీ అంతర్గత వర్గాల్లో అంతర్గత సంభాషణలు సాగుతున్నాయి.
పార్టీకి నష్టం కలిగించే వారిని ఉపేక్షించని చంద్రబాబు
ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు శైలి పూర్తిగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, పరిపాలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆయన.. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిని, ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుంటున్న నేతలను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. గతంలో కావ్య కృష్ణారెడ్డిని టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందు కూడా విచారించింది. తాజా హెచ్చరిక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. లీడర్లు మారకపోతే తానే ప్రత్యామ్నాయాలు చూసుకోవడానికి సిద్ధమనే సంకేతాన్ని చంద్రబాబు ఈ ఘటన ద్వారా స్పష్టం చేశారు.

