తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయంగా తనను తాను తగ్గించుకున్న అన్నామలైను ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపే వ్యూహంలో ఢిల్లీ పెద్దలు ఉన్నారు.
అన్నామలైను రాజ్యసభకు పంపేంత సంఖ్యాబలం బీజేపీకి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, అక్కడ త్వరలోనే ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో బీజేపీకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీ పెద్దల కన్ను ఏపీపై పడింది. మిత్రధర్మంలో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా ఇందుకు అంగీకరించే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను అన్నామలై తమిళనాడులో తీవ్రంగా ఎండగడుతున్నారు. ఆయనను రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే దక్షిణాదిలో బీజేపీకి ఒక బలమైన వాయిస్ లభిస్తుందని ప్రధాని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్‌లో కూర్చుని తమిళనాడు, దక్షిణాది వ్యవహారాలను ఢిల్లీ నుంచే శాసించేలా ఆయనకు పవర్ ఇవ్వాలన్నది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది.
అన్నామలైని ఏపీ కోటా నుంచి రాజ్యసభకు పంపడం అనే ప్రతిపాదన ఇప్పుడు అమరావతిలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఖాళీ కాబోయే నాలుగు స్థానాల్లో మూడు టీడీపీ ఉంచుకుని ఒకటి బీజేపీ, జనసేనల్లో ఒక పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర పెద్దల నిర్ణయం కావడం, పైగా ఏపీలో చంద్రబాబుతో అన్నామలైకి ఉన్న పాత పరిచయాలు, సత్సంబంధాలతో ఈ ప్రతిపాదన సాఫీగానే సాగిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

